తొక్కడం ఎందుకు.. కడిగే ప్రయత్నం చేయడం దేనికి? తొక్కిన తర్వాత అంటకుండా ఉంటుందా.. కడిగినా మరకలు కనిపించకుండా పోతాయా? తొక్కేముందే ఆలోచించాలి.. తొక్కిఅడుసు తొక్కనేల.. కాలు కడుగనేల? న తర్వాత ఆలోచించాల్సిన అవసరం ఏ మాత్రం అక్కర్లే. కీర్తికిమరకలంటిస్తానంటే అపకీర్తి మూటగట్టుకోవాల్సిన పరిస్థితే. అపకీర్తిని అపరకీర్తిగా భావిస్తానంటే చరిత్రహీనమే. అతిథిదేవో భవఅన్న ఆదర్శ జీవనం నాది. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం అతడికి. అలాంటివారికి మర్యాద చేస్తే తప్పుబట్టే అవకాశమే లేదు. కానీ, తలవంచే మాదిరి మర్యాదను అప్పగిస్తానంటేనే తప్పక తప్పుబట్టాల్సిందే. తరాల ముందు వంచుకు నిలబడాల్సిందే.
విమర్శకు సహనం ఉంటుంది.. పొగడ్తకు హద్దుంటుంది. శృతిమించనంత వరకు ఏదైనా ఇంపే.. పరిధులు దాటితే ముమ్మాటికీ కంపే. చేసింది తప్పని ఎవరూ తేల్చాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. జరిగిన దానిని దిద్దుకునే యత్నం చేస్తే సర్లే అనుకుంటారు గానీ, పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా చేసిందే చట్టం.. నడిచిందే మార్గం అన్నట్టుగా వ్యవహరిస్తే కీర్తి మూటగట్టుకోవడం ఏమో గానీ, అపకీర్తిని మోయాల్సిన అవశ్యం ఏర్పడుతుంది.
చెంబివ్వడం వేరు, చెంబులో నీళ్లు నింపి అందివ్వడం వేరు. నీళ్లను చెంబుతో ఒలకబోస్తూ తడపడం ఇంకా వేరు. సాక్షిభూతాలుగా దృశ్యాలు కనిపిస్తున్నా దబాయింపులకు దిగడం దౌర్భాగ్యంగానే పరిగణించాల్సిందే. నీళ్లిస్తే తప్పనే సమాజమే కాదిది. తుడిచేందుకు తువాలు ఇస్తే గర్వంగా భావించే తాలూకిది. వచ్చినవారు అతిథులు కానే కాదు.. మున్ముందు మాట్లాడుకోవచ్చు గానీ, ప్రస్తుతానికి వారితో ఒనగూడే విషయమై స్పష్టతే లేదు. ఇంటికొచ్చినవారు అతిథులే అనుకోవడం సరే గానీ, వచ్చిన ప్రతి ఒక్కరూ అతిథులే అనడం సరికాదు. వచ్చినవారికి కడుపు నింపడంలో తప్పు లేదు.. తప్పు కానే కాదు. కానీ, సంప్రదాయాలు మరిచి వచ్చినవారి ముందు సాగిలపడేలా వ్యూహరచన చేసిన తీరే బాధాకరం. ఆలోచన ఎవరిదో, అనుకరణ మరెవరో గానీ, ఆడపడుచులతో పాదాలపై నీళ్లు పోయిస్తూ తుడుచుకునేందుకు తువాలు అందిస్తున్న తీరు, అందునా స్వయంగా తుడుస్తున్న తీరు హేయం.
అడుసు తొక్కనేల.. కాలు కడుగనేల..? చూడకుండా కాలేస్తే చూసీచూడనట్టుగానే వ్యవహరించేవారేమో గానీ, చూసి మరీ కార్యానికి శ్రీకారం చుడితే బానిసత్వపు బీజాలకు ప్రేరణగా భావించాలా.. బరితెగింపు కార్యానికి గిరిగీసిన తీరు అనాలా? వాదనలు అక్కర్లేదు.. ప్రతివాదనలకు తావులేదు. కాళ్లకు నీళ్లివడం వేరు, కాళ్లు కడిగి తుడవడం మరింకా వేరు. తప్పొప్పులు.. మానమర్యాదలు.. సమయాన్ని బట్టి, సందర్భాన్ని అనుసరించి స్వీకరణ, సమర్పణలు జరగాలే తప్ప అసందర్భంగా, అన్యాక్రాంతంగా అన్నీ చేస్తానంటే అపహాస్యం తథ్యం, అపకీర్తి నిత్యకృత్యం.
కాకతీయ రాజుల పాలనాసామర్థ్యం, కళాఖండాల సృష్టిని పెంచిపోషించిన ఔన్నత్యం, శత్రుమూకలపై ప్రదర్శించే పౌరుషం, ప్రజల జీవన విధానం, నరనరాన జనం జీర్ణించుకున్నపట్టుదల, పౌరుషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటకోసం ప్రాణాలైన వదులుకునే మడమతిప్పని తనం ప్రాంతవాసుల సొంతం. అతిథులను గౌరవించాలన్నా, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలన్నా ఓరుగల్లు బిడ్డల తర్వాతే ఎవరైనా. ఈ విషయాలను ప్రకటించడంలో అతిశయోక్తి కాదు, అతి అస్సలే లేదు. మంచికి తలవంచే తీరు, చెడు ఎదురైతే నిలదీసే ధైర్యశాలురు.
రామప్ప ఓ కీర్తి కిరీటం. చరిత్రను సమస్తులకు బోధిస్తూ, ప్రత్యక్షులకు కంటికింపుగా కనిపిస్తూ తన స్థాయిని విశ్వవ్యాప్తంగా నిలుపుకొంటున్న అత్యద్భుతం. పేరు వింటేనే ఓ మధురం, కళారూపు చూస్తే మహదానందం. భంగిమల భవితవ్యం తేల్చడానికి, శిల్పాల సౌందర్యం తరచిచూడటానికి.. ఎంతకీ అంతుచిక్కనిదిగానే ఉంది, ఎప్పటికీ తేలని మహా రహస్యంగానే మారింది. ఒళ్లంతా కళ్లు చేసుకొని చూసినా, అణువణువు తడిమినా అర్థంగాని విషయాలెన్నో.. ఆ మాటకొస్తే విశేషాలు లెక్కకు మిక్కిలి. కట్టడమే ఓ మిస్టరీ. ఇసుకలో పేర్చిన కూర్పు.. ఎక్కడా కించిత్ వంకపెట్టడానికి కూడా అవకాశం కల్పించని కళాకారుల నైపుణ్యం.. శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని నిర్మాణ కౌశలం.. అన్నీ వింతలే, ఎన్నెన్నో ప్రత్యేక తీరుతెన్నులు.
చరిత్ర గురించి, వీరనారీత్వం గురించి చెప్పడం మళ్లీ మళ్లీ వల్లె వేయడమే. తెలంగాణ బిడ్డ తెగిస్తే ఏం జరిగిందో మేడారానికి తెలుసు, ఐలమ్మ వారసులకు ఎరుక, బతుకు లేదని పాతేయాలని చూసినా ప్రపంచమంతా చుట్టొచ్చిన బతుకమ్మకు అంతకుమించి తెలుసు. గతం ఇంతకన్నా ఎంతో మధురం, మరెంతో ఘనం. అంతెందుకు మొన్నటిమొన్న కిరణుడు హెలీకాప్టర్ దిగీదిగంగానే రాళ్లిసిరిన రాయినిగూడెం, కుర్చీ నుంచి రోశయ్యను కదలకుండా చేసిన విధానం, అహంకారపు ఆంధ్రా పెత్తందారీని అడుగడుగునా నిలువరించిన పౌరుషపు నేలగా దీన్ని సమస్త జగత్తు చూసినదే.
ఇంటికొచ్చిన అతిథులను కడుపునిండా సత్కరించి సాగనంపే సంప్రదాయం తెలంగాణ సొంతం. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడంలో ఈ ప్రాంత ప్రజల తర్వాతే ఎవరైనా, ఎంతటి వారైనా. అంతటి ఘనకీర్తిని కాళ్లబేరానికి పెడితే చరిత్ర క్షమిస్తుందా.. తరాలు అంత తేలిగ్గా మర్చిపోతాయనుకోవాలా? పాలన- పథకాలు, మంచి-చెడు, రాజకీయం- రాజసం, వాదనలు- వితండవాదాలు, ఆరోపణలు- ప్రత్యారోపణలు, దుమ్మెత్తిపోసుకోవడం- ఒళ్లంతా పూసుకోవడం, అధికారం-ప్రతిపక్షం, ఇంటా-బయట.. ఇలా మనకు మనంగా ఎన్నైనా భరిస్తాం.
ఇంట్లో ఎన్ని లొల్లులున్నా బయటకు మాత్రం ఒక్కటిగానే అనే తీరుకు పేటెంట్ మనమే. పరాయి ముందు అంతా ఒక్కటనే బడాయి చూపాల్సిందే, చూపుతున్నాం, చూపుతాం కూడా. కానీ, కాళ్లబేరానికి పెట్టి, త్యాగజీవి ఔన్నత్యాన్ని తాకట్టు పెడతానంటే ఇంటివాడైనా మంట్లె గలిపే రక్తం ఇక్కడి సొంతమే. రామలింగేశ్వరుడి సాక్షిగా హేమాహేమీల సౌజన్యంలో అందాల ఆరబోతకు వచ్చిన అతివలకు అతిథి మర్యాదల్లో సాష్టాంగపడిన తీరుకు సమస్తులు నొచ్చుకున్నారే గానీ, మెచ్చుకున్నవారు ‘వాళ్లు’ తప్ప మరెవరూ లేరు. వాదించడానికి విషయమేమీ లేదిక, వక్రభాష్యం చెప్పడానికి సందర్భమేమీ కాదిది. తెలిసి చేసినా, తెలియక జరిగినా తప్పు తప్పే. తప్పించుకోజూస్తే తప్పు మీద తప్పే. ఘనకార్యాలు చేయకున్నా పర్లేదు గానీ, తలవొంపుల కర్తవ్యాన్ని రుద్దే ఘటనలకు దిగకుంటే అదే పదివేలు. గతంలోనూ ‘చెప్పులు లేకుండా వెళ్లే వారు…’ అని చెప్పిన చరిత్ర ఉన్న పెద్దలు ఈ విషయంలో ఏదేదో చెప్పి తప్పించుకోజూస్తే ఎవరూ చూడటం లేదనుకున్న పిల్లి చందంగానే భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రతి తప్పునకు లెక్కున్నట్టే ఫలితం భవిష్యత్తే నిర్ణయిస్తుందనే వాస్తవాన్ని మరిచిన ఘనాపాఠీలు.. పాదాక్రాంతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనే విషయం ఇప్పుడప్పుడే వారికి అర్థమవ్వదులే.
– రాజేంద్ర ప్రసాద్ చేలిక 99858 35601