Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేలా కేసీఆర్ నిర్మించిన అద్భుత నిర్మాణం సచివాలయం. దీనిని నిర్మిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ నిర్మించిన ఈ కట్టడాన్నే అద్భుతసౌధంగా ప్రపంచ దేశాల సుందరీమణులకు పరిచయం చేసింది. అంతేకాదు, రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలపై సచివాలయం సాక్షిగా డ్రోన్‌షో నిర్వహించింది. ప్రతి పథకానికి సంబంధించిన డ్రోన్‌షో ఫొటోలో కేసీఆర్ నిర్మించిన సచివాలయమే కనిపించడం విశేషం. ఆదివారం మిస్ వరల్డ్ కంటిస్టెంట్లు సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం ఎదుట 112 దేశాల అందాలభామలు గ్రూప్ ఫొటో దిగారు.
సచివాలయాన్ని చూసి మైమరచిన అందగత్తెలు సో నైస్ అంటూ కితాబిచ్చారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి మంత్రి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తంచేశారు. సచివాలయ సందర్శనకు ముందు తెలంగాణ రాష్ట్ర భద్రతలో భాగంగా కేసీఆర్ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించారు. శాంతి భద్రతలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పర్యాటకులకు కల్పిస్తున్న భద్రతపరమైన అంశాలను వారికి తెలియజేశారు. కేసీఆర్ నిర్మించిన సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముద్దుగుమ్మ లు సందర్శించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు జై కేసీఆర్ అంటూ పోస్టులు చేశారు.