చిన్నగూడూరు/చెన్నారావుపేట, జనవరి 17 : ‘మనఊరు- మనబడి’ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఆయా కాంట్రాక్టర్లు శనివారం పాఠశాలలకు తాళం వేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు కాంట్రాక్టర్ ధారాసింగ్ తాళం వేసి మీడియాతో మాట్లాడారు. 2022లో చిన్నగూడూరు ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ‘మనఊరు -మనబడి’ కింద ఎంపికైనట్టు తెలిపారు. రూ.4.50 లక్షలతో అభివృద్ధి పనులు పనులు చేసి మూడేండ్లు కావస్తున్నా నేటికీ బిల్లులు రాకపోవడంతో తాళం వేశామని వివరించా రు. అధికారులు తక్షణమే స్పందించి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మనఊరు- మనబడి బిల్లుల కోసం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం ప్రభుత్వ పాఠశాలకు ఎస్ఎంసీ మాజీ చైర్మన్ నామిడ్ల సురేశ్ తాళంవేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా బిల్లులు ఇంతవరకు చెల్లించలేదని చెప్పారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలని, లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.