హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు.. పాలకుల వైఖరిని నిలదీస్తే బేడీలు.. ఇదీ ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ పాలనలో అమలవుతున్న సొంతనీతి. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టు పను లు చేసిన చిరు కాంట్రాక్టర్లపైనా ప్రభుత్వం ఇదే దమననీతిని పాటించింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన కాంట్రాక్టర్లు.. బిల్లుల పంపిణీలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యాన్ని ప్రశ్నించారు.
నెలలుగా విసిగి వేసారిన కాం ట్రాక్టర్లు ఏకంగా సచివాలయంలోకి వచ్చి మొరపెట్టుకున్నారు. అదే వారు చేసిన పాపమైంది. ఏకంగా సచివాలయంలో ఆందోళన వ్యక్తంచేసిన 11 మంది కాంట్రాక్టర్లపై పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అసలు అప్పులు, వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. కేసుల పేరిట కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇటీవలే సచివాలయంలో ధర్నా చేసి న 11 మంది మన ఊరు -మన బడి కాంట్రాక్టర్లపై సైఫాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమో దు చేశారు.
ఎస్పీఎఫ్ సీఐ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు ఈ కేసును నమోదుచేశారు. ఇవి అక్రమ కేసులని బాధిత కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ బాధ, గోడును వెళ్లబోసుకుంటే ఇలా అక్రమ కేసులు నమోదుచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ‘ఇంతకూ మేం చేసిన నేరమేమిటి? బిల్లులు చెల్లించకపోవడం మీ వైఫ ల్యం. పైగా మాకు హక్కుగా రావాల్సిన డబ్బులడిగితే మాపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనం’ అని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మన ఊరు- మన బడి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 9,000 పైచిలుకు సర్కారు బడు ల్లో చిరు కాంట్రాక్టర్లు పనులు చేశారు. రూ.600 కోట్లకు పైగా బకాయిలు వీరికి రావా ల్సి ఉన్నది. ఈ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎక్కని గడపా లేదు.. తొక్కని మెట్టూలేదు. తిరిగి తిరిగి వేసారిపోయిన కాంట్రాక్టర్లంతా మన ఊరు- మన బడి బిల్లుల బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. తొలుత జూలై 14న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బిల్లులు మంజూరు చేయకపోతే బడులకు తాళాలేస్తామని తేల్చిచెప్పారు. సర్కారు నుంచి ఇసుమంతైనా స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్లు ఈ నెల 18న సచివాలయంలో రెండో అంతస్తులో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన 11 మంది కాంట్రాక్టర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు.
మన ఊరు-మన బడి బిల్లుల బాధితుల సంఘం నేతలు కొంతకాలంగా పోరుబాట పట్టారు. అంతా ఏకమై సర్కారుపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ముఖ్యంగా సచివాలయంలో ఆర్థికశాఖ మంత్రి చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీనిని సర్కారు జీర్ణించుకోలేకపోతున్నది. ఎలాగైనా కాంట్రాక్టర్లను భయపెట్టాలని, గొంతునొక్కాలని కేసులు పెడుతున్నది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న 11 మందిని ఎంపిక చేసుకుని, వారిపైనే కేసులను నమోదు చేసింది. దీనివెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని బాధిత కాంట్రాక్టర్లు అనుమానిస్తున్నారు. 11 మంది కా్రంటాక్టర్లపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మన ఊరు -మన బడి బిల్లుల బాధితుల సంఘం నేతలు డిమాండ్చేశారు. కేసులను ఉపసంహరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతంచేస్తామని హెచ్చరించారు.