Congress Govt | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లుల మంజూరు హాట్ టాపిక్‌గా మారింది. తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని, తాము సిఫార్సు చేసినా చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు రావడం లేదని క్యాబినెట్ సమావేశంలో మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రూ. 5-10 లక్షలకు కూడా ఆర్థికశాఖ మంత్రి వైపే చూడాలా? ఇలా అయితే మాకు మంత్రి పదవులు ఎందుకు? అని ఒకరిద్దరు గట్టిగానే మాట్లాడినట్టు సచివాలయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
ఒకవైపు అమాత్యుల ఆవేదన ఇలా ఉండగా బిల్లుల విషయంలో ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్లు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు ఆర్థికశాఖలో జరుగుతున్న వసూళ్ల గురించి గుసగుసలు వినిపిస్తున్నాయి. రా ష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తొమ్మిది నెలలే అయింది. కొత్తగా పరిపాలన అనుమతులు ఇచ్చి ప్రారంభించిన పెద్ద ప్రాజెక్టులేవీ లేవు. కానీ, గత ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టులు పూర్తి అవుతుండటంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఆర్థికశాఖ చుట్టూ తిరుగుతున్నారు.
కాంట్రాక్టర్లు మాత్రమే కా దు.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ చిన్న చిన్న క్లెయిమ్‌లను తీసుకోవాలంటే పైసలు ముట్టజెప్పనిదే పని కావటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగుల బిల్లుల విషయంలో ఆర్థికశాఖలోని కొందరు ఉద్యోగులే బ్రోకర్లుగా అవతారమెత్తగా, కాంట్రాక్టర్లు, పెద్ద బిల్లుల విషయంలో ప్రభుత్వంలోని పెద్ద తలకాయలే జోక్యం చేసుకొని పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రభుత్వంలోని రకరకాల బిల్లులు ఆగిపోయాయి.
అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరటంతో అంతా గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేదు. తొలుత కొంతమంది చిన్నాచితక కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేసినా ప్రతిదానికీ ఒక రేటు పెట్టినట్టు భోగట్టా. రూ.కోటి, ఆపైన ఉండే బిల్లులకు కాంట్రాక్టర్లకు ఉండే తొందర, అవసరాన్ని ఉపయోగించుకొని ‘గట్టి’ టాక్స్ విధిస్తున్నారు. ఇలాంటి బిల్లుల వసూలు సందర్భంగా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆర్థికశాఖలోని ఒక ముఖ్యమైన వ్యక్తే ఆయన కుటుంబ సభ్యులను నేరుగా రంగప్రవేశం చేసి బిల్లులను క్లియర్ చేయిస్తున్నట్టు అధికారులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.
ఆమెదే డామినేషన్
ఆర్థికశాఖలో బిల్లుల విషయంలో ‘ఆమె’పైనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సారును కాదు.. ఆమెను కలిస్తే తొందరగా పని అవుతుందని పేషీ అధికారులే చెప్తున్నట్టు సమాచారం. రోజువారీగా జరిగే అధికారిక కార్యక్రమాలను పక్కన పెడితే.. బిల్లులకు సంబంధించిన రోజువారీ వ్యవహారాలను మేడంగారే చక్కబెడుతున్నారట. పుత్రరత్నం కూడా వసూళ్లలో ఒక చెయ్యేస్తున్నట్టు తెలిసింది. పార్లమెంటు ఎన్నికల ముందు రోజుకు సగటున కనీసం రూ. వంద కోట్ల బిల్లులు మంజూరు చేయించనిదే మేడంగారు నిద్రపోయేవాళ్లు కాదని చెప్తున్నారు.
‘సారు’ కూడా ఇంటి నుంచి వచ్చిన ఆ టోకెన్లను అధికారులకు ఇచ్చి పనిచేయించేవారట. పెద్ద మొత్తాల్లో బిల్లులు ఉంటే అందులో కొంత మొత్తాన్ని విడదీసి తొలుత రిలీజ్ చేసేవారు. ఫస్ట్ రిలీజ్ చేసిన సొమ్ము నుంచి కమిషన్ అప్పగిస్తే మరుక్షణమే మిగిలిన సొమ్ము బిల్లులు మంజూరైపోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజీ అన్నది కాంట్రాక్టరు అవసరాన్ని బట్టి ఖరారవుతుంది. ముఖ్యుల సిఫార్సుతో వచ్చిన బిల్లుల్లో కూడా ఏడు శాతానికి అదనంగా 1-2 పర్సంటేజీ ఇస్తేకానీ ఫైళ్లు కదలడంలేదని చెప్తున్నారు. ఆర్థికశాఖలో బిల్లులు మంజూరు చేయించటానికి సంబంధించి ఇలా ఏకంగా ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారని చెప్తున్నారు.
ఢిల్లీ పేరుతో హల్చల్
7 శాతం సొమ్మును హైకమాండ్‌కు చెల్లించాల్సి ఉంటుందంటూ కాంట్రాక్టర్ల వద్ద నుంచి వసూలు చేసినట్టు తెలిసింది. కొంతమంది బడా కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి మరీ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ ఏడు శాతాన్ని తామే నేరుగా పంపించుకుంటామని వసూలు చేసినట్టు సమాచారం. 7 శాతం కమీషన్ ఢిల్లీకి పోతుందని, తమకు ఖర్చులకు ఒక శాతం ఇవ్వాలని కూడా వసూళ్లకు పాల్పడ్డారు. మొత్తంగా 8 శాతం చెల్లిస్తేనే బిల్లు మొత్తం విడుదలయ్యేది. లేకపోతే పెండింగే.
కొంతమంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇటీవల బిల్లులు మంజూరు కోసం వెళ్లగా.. ‘అన్నా మీరు కూడా 7 శాతం ఇవ్వాల్సిందే. మీకు కావాలంటే ఇంకేమైనా పని తెచ్చుకోండి చేసి పెడ్తాం’ అని చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ జడ్పీటీసీ రూ.పది కోట్ల బిల్లును వసూలు చేసేందుకు కొత్తగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యేకు 8 శాతం కమీషన్ ముట్టచెప్పుకున్నట్టు తెలిసింది. ఇదే ప్రాంతం నుంచి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీచేసిన ఓ అభ్యర్థికి సర్దుబాటు చేయాల్సి వచ్చిందని చెప్తూ ఓ కాంట్రాక్టర్‌కు భారీ బిల్లును మంజూరు చేశారు. దీంట్లో రూ.25 కోట్లు అభ్యర్థి ఖర్చు కింద చూపించారట.
గట్టి టాక్స్.. పొట్టి టాక్స్
గట్టి టాక్స్‌ను ఒకరే వసూలు చేస్తే పెద్దాయన ఏమై పోవాలి? అందుకే రాష్ట్రంలోని అతి పెద్ద ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఆర్థిక వ్యవహారాల ఇన్చార్జికే వసూళ్ల బాధ్యతలు అప్పగించారు. ఆయన అతి పెద్ద కాంట్రాక్టర్లను ముఠా కట్టించి వసూళ్లు చేసి పెడుతున్నాడు. ఈ వ్యవహారం బడాకాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించబోయే ఎత్తిపోతల పథకానికి కాంట్రాక్టర్‌ను వీళ్లు ఇప్పటికే సిద్ధం చేశారు. దీంట్లో గట్టి టాక్స్‌తో పాటు పొట్టి టాక్స్‌లు కూడా ఉంటాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని, అన్నింట్లోనూ సిండికేట్ చేసే వ్యవహారాలను ఈ బడా కంపెనీతోపాటు రాష్ట్రంలోని మరోమంత్రి కంపెనీకి అప్పగించినట్టు కాంట్రాక్టర్ల వర్గాల్లో చర్చ జరుగుతున్నది.