హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : బిల్లులు చెల్లించాలని అడిగిన కాంట్రాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందా? ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారనే అక్కసుతో అత్యవసర మెమో జారీచేసిందా? గుత్తేదారుల నోరు మూయించేందుకే వారుచేసిన పనుల లెక్కలు తేల్చేందుకు సిద్ధమైందా? ఆ పనుల గణాంకాల ఆధారంగా కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపేందుకే సిద్ధమవుతున్నదా? అంటే గుత్తేదారుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తున్నది. రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన నిర్మాణరంగాన్ని ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.20 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
ఆ బిల్లుల అందక ఆర్థిక ఇబ్బందులతో పలువురు గుత్తేదారులు గుండె ఆగి చనిపోయారు. ప్రభు త్వం మాత్రం ఆ వర్గాన్ని మరింత కుంగదీసేలా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకుండా ఉన్న ప్రభుత్వం.. కాంట్రాక్టర్లు బిల్లులు అడగడంతోనే ఉన్నపళంగా పనుల లెక్క తేల్చాలని చూస్తున్నది. ఇందులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయినవి ఎన్ని? పూర్తికాని పనులెన్ని? అంతకు ముందు ఎన్ని పనులు పూర్తిచేశారు? వంటి వాటిపై లెక్కలు సేకరిస్తున్నది. ఇందుకు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చిన ప్రభుత్వం.. పనుల గణాంకాల ఆధారంగా కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. తమ బిల్లులు చెల్లించాలని ఈ నెల 18న కాంట్రాక్టర్లు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకే రోడ్లు, భవనాల శాఖ తాజాగా ‘అత్యవసర మెమో’ను అస్త్రంగా ప్రయోగించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.20 వేల కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నది. ఆ బిల్లులు రాకపోవడంతో వందల కోట్ల టర్నోవర్ ఉన్న కాంట్రాక్టర్లు సైతం దివాలా తీసి రూ.10 కోట్ల నుంచి 20 కోట్లకు పడిపోయారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్లు, వడ్డీలు చెల్లించలేక తీవ్ర మానసిక క్షోభతో గుండెపోటుకు గురవుతున్నారు. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుల వివరాలు ఇతరులకు కనబడకుండా వెబ్సైట్ను సైతం క్లోజ్ చేయడం గమనార్హం. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు బిచ్చగాళ్లలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కాంట్రాక్టర్లను నమ్ముకొన్న వేలాది మంది సిల్డ్, నాన్-సిల్డ్ కార్మికుల కుటుంబాలు సైతం ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, గుత్తేదారులందరిలో భరోసా కల్పించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ప్రతినిధులు శుక్రవారం ఖమ్మంలో సమావేశమై ‘ఈ నెల 18న చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆవేదనలో ఉన్న కాంట్రాక్టర్లను పిలిచి చర్చించి, భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ సర్కార్.. వారిని లొంగదీసుకునేందుకు పనుల నిర్వహణపై మెమో జారీ చేసిందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ నెల 18న హైదరాబాద్ ముట్టడికి సిద్ధమవుతుండటంతో తమను లొంగదీసుకొనేందుకు ప్రభుత్వం ఆర్అండ్బీ శాఖ ద్వారా హుటాహుటిన ‘మోస్ట్ అర్జెంట్’ మెమోను తెరపైకి తెచ్చిందని గుత్తేదారులు మండిపడుతున్నారు. రోడ్లు, భవనాలశాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) శుక్రవారం జారీచేసిన మెమోలో 2023 డిసెంబర్ 7వ తేదీ కంటే ముందు, ఆ తర్వాత మంజూరై నిలిచిన ప్లాన్, నాన్-ప్లాన్ రోడ్డు పనుల వివరాలను జూన్ 6లోపు.. అంటే ఒక్క రోజులోనే అత్యవసరంగా పంపాలని ఎస్ఈలను మెమోలో ఆదేశించారు. ఇందులో అసలు వినాశకరమైన నిబంధన ఏమిటంటే? ఆ పనులను నిలిపివేయడానికి కాంట్రాక్ట్ ఏజెన్సీల రాతపూర్వక అంగీకారాన్ని కూడా సేకరించాలని చెప్పడం. ‘మాకు బిల్లులు ఇవ్వకపోయినా పర్వాలేదు.
ఈ పనులను ఇకడితో ఆపేయడానికి మాకు సమ్మతమే’ అని కాంట్రాక్టర్ల చేత బలవంతంగా సంతకాలు చేయించుకొనే కుట్రకు ఈ మెమో ద్వారా ప్రభుత్వం తెరలేపినట్టు స్పష్టమవుతున్నది. ఒకవేళ ఏ కాంట్రాక్టర్ అయినా 18న జరిగే ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తే.. వారి పనులను రద్దు చేస్తామనే పరోక్ష హెచ్చరికలు పంపడానికే ఈ మెమో జారీ చేశారని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు అడిగితే.. బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం, ఎదురుదాడికి దిగు తూ పనులను క్లోజ్ చేయాలని కాంట్రాక్టర్లను బెదిరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు దాదాపు 16 జిల్లాల అధికారులను పురమాయించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్న ఈ నిరంకుశ పోకడలను గుత్తేదారుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బెదిరింపులకు భయపడేది లేదని, 18న ‘చలో హైదరాబాద్’ ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తీరుతామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తున్నారు.