హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో 300 ఓసీఎస్(ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు డాక్టర్లు) కింద పని చేస్తున్న కాంట్రాక్టు మెడికల్ ఆఫీసర్ల (ఎంబీబీఎస్ డాక్టర్లు)కు 7 నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కాంట్రాక్టు వైద్యులు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో 52 మంది వైద్యులు పనిచేస్తున్నారు. వీరికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ట్రెజరీ ఆఫీసు అనుసంధానంగా ప్రభుత్వం జీతాలు చెల్లించాల్సి ఉంది. దసరా, దీపావళి పండుగలు ముగిసినా.. ఇప్పటి వరకు ప్రభుత్వం తమ పెండింగ్ జీతాల విషయంలో స్పందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు కాంట్రాక్టు డాక్టర్లు తెలిపారు.
కొంత మంది కాంట్రాక్టు వైద్యులు క్రెడిట్ కార్డులు వాడుకుని, మరికొంత మంది అప్పు చేసి మరి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వాపోయారు. బడ్జెట్ లేదనే సాకు చూపి మార్చి నుంచి వీరి రెన్యువల్ ప్రక్రియను సైతం ప్రభుత్వం చేపట్టడం లేదు. కరోనా సమయంలో విధుల్లో చేరామని, బీఆర్ఎస్ హయాంలో నెల ఆలస్యం అయినా.. జీతాలు పడేవని, కానీ ఇప్పుడు 7 నెలలుగా జీతాలు రావడం లేదని వాపోయారు. పెండింగ్ జీతాల గురించి అడిగినప్పుడల్లా వచ్చే నెల చూద్దామని అధికారులు చెబుతున్నారని, ఇలా ఏడు నెలలు గడిచిపోయాయని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఇద్దరు వైద్యులను రెన్యువల్ కాలేదనే సాకు చూపి నోటి మాటతో విధుల్లో నుంచి తొలగించారని, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు వైద్యులపై ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమ పెండింగ్ జీతాలు చెల్లించడంతో పాటు సర్వీస్ రెన్యువల్ ప్రకియ చేపట్టాలని కాంట్రాక్టు వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.