హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని డ్రగ్స్ హాట్స్పాట్లపై నిరంతర నిఘా కొనసాగుతున్నదని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్, ఎస్టీఎఫ్ చేపట్టిన దాడులు, అరెస్టులు, స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు, సిబ్బంది పనితీరుపై గురువారం ఆబ్కారీ భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేవరకూ నిద్రపోయేది లేదు. ధూల్‌పేట్‌లో దాదాపు 95 శాతం గంజాయిని నిర్మూలించాం. చాలా మందిని జైలుకు పంపాం. ఈ నెల చివరి నాటికి పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి త్వరగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్‌గానీ, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని వదిలిపెటొద్దు. స్థానిక పోలీసులతో కలిసి దాడులు ముమ్మరం చేయండి’ అని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు, అడిషనల్ ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, డీఎస్పీలు పాల్గొన్నారు.
– హైదరాబాద్ ఆర్పీవో స్నేహజ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : సాంకేతిక సమస్యల కారణంగా పాస్‌పోర్టు సేవల్లో అంతరాయం కలిగిందని, సెప్టెంబర్ 2న ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా సేవలు అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి స్నేహజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నమోదైన స్లాట్స్ ను మరో తేదీకి మారుస్తామని, అందుకు సంబంధించిన సందేశాలు దరఖాస్తుదారులకు చేరవేసినట్టు పేర్కొన్నారు. స్లాట్స్‌కు సంబంధించి సందేహాలుంటే po. hyderabad @mea.gov.inకు మెయిల్ చేయవచ్చని సూచించారు.