ములుగు: ములుగు (Mulugu) జిల్లాల్లో వర్షం దంచి కొడుతున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నది. జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట, మల్లంపల్లి మండలాల్లో ఆగకుండా వాన కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా, గురువారం మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడుతాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని పేర్కొంది.
శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.