సిరిసిల్ల రూరల్, నవంబర్ 23 : ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని అప్పు చేసి నిర్మాణం మొదలు పెట్టిన ఓ లబ్ధిదారురాలు ఆనందం అంతలోనే ఆవిరైంది. బేస్మెంట్ పూర్తయి ఖాతాలో పడిన బిల్లు వెనక్కి పోవడంతో లబోదిబోమంటున్నది. ఓ అధికార పార్టీ నేత కక్షసాధింపు వల్లే తమకీ పరిస్థితి వచ్చిందని వాపోతున్నది. ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని, తెచ్చిన అప్పులు మీదపడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బాధితుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలకేంద్రంలో నేత కుటుంబానికి చెందిన దిడ్డి లావణ్య-భాస్కర్ దంపతులకు మేలో ఇందిరమ్మ ఇల్లు మంజూరుకావడంతో సంతోష పడ్డారు. ఉన్న ఇంటిని కూల్చేసి, అద్దె ఇంట్లోకి వెళ్లారు. విడుతల వారీగా డబ్బులు వస్తాయనే ఆశతో తెలిసిన చోటల్లా రూ. 6లక్షల దాకా అప్పు చేసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణ సమయంలో కార్యదర్శి సమీర్‌తోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. బేస్మెంట్ పూర్తి చేయడంతో గోడలు కొంత వరకు లేపారు. మొదటి విడుత రూ.లక్ష ఖాతాలో జమ కావడంతో సంతోషపడ్డారు. ఈవిషయాన్ని సంతోషంగా పంచాయతీ సెక్రటరీకి తెలుపగా, ఇందిరమ్మ ఇల్లు కమిటీ గ్రూప్‌లో ‘దిడ్డి లావణ్యకు రూ.లక్ష నగదు జమైంది’ అని పోస్ట్ చేశాడు.

ఇక్కడే అసలు కథ మొదలైంది. బిల్లు జమ అయిందని తెలుసుకున్న ఇందిరమ్మ కమిటీలో ఉన్న ఓ అధికార పార్టీ నేత పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని, జమ అయిన నగదును ఫ్రీజ్ చేయించి, రివర్స్ వెళ్లేలా చేశాడు. అప్పులు చేసి ఇల్లు మొదలుపెట్టుకున్నామని అధికారపార్టీ నాయకులతోపాటు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసి మొరపెట్టుకున్నారు. కలెక్టర్‌కు సైతం విన్నవించారు. మూడు నెలలుగా ఇందిరమ్మ ఇల్లు బిల్లుల కోసం తిరుగుతున్నామని దిడ్డి లావణ్య-భాస్కర్ వాపోయారు. అధికార పార్టీ నేత కేకే మహేందర్‌రెడ్డికి సైతం కలిసి మొరపెట్టుకున్నా.. ‘మాచేతుల్లో ఏంలేదు… కలెక్టర్ వద్దకు వెళ్లాలి’ అని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని దంపతులు వేడుకుంటున్నారు. ‘గతంలో ప్రెండ్స్ క్లబ్ భవనంలో స్థల విషయంలో కార్మిక సంఘానికి, ప్రెండ్స్ క్లబ్ సభ్యులతో గొడవ తలెత్తింది. ఈగొడవలు ఠాణాకు వరకు చేరాయి. నాపై కూడా కేసు పెట్టారు. అది మనసులో పెట్టుకొని నాపై కక్ష సాధింపు చేస్తున్నారు. నాకుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నారని’ భాస్కర్ వాపోయాడు. ఈ విషయమై కార్యదర్శి సమీర్‌ను సంప్రదించగా, బిల్లు రివర్స్ విషయంపై తమకు సమాచారం లేదని తెలిపాడు. హౌసింగ్ పీడీ ఆదేశాలతో తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బిల్లు వెనక్కితీసుకున్నట్టు తెలిసిందని చెప్పారు.