హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి సేవలను మెరుగుపరిచారని గుర్తుచేశారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా హైదరాబాద్లోని కొత్తపేట, ఎర్రగడ్డలో నిర్మాణ దశలో ఉన్న టిమ్స్ దవాఖానల చిత్రాలను పోస్ట్ చేశారు. ‘ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఆరోగ్య తెలంగాణ దిశగా ఆయన వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ దవాఖానల తాజా చిత్రాలే ఇందుకు సజీవ సాక్ష్యాలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేయకుంటే ఇప్పటికే సరికొత్త హంగులతో ఈ దవాఖానలన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు అలసత్వాన్ని వీడి టిమ్స్ దవాఖానల నిర్మాణ పనులను యుద్ధప్రాతిదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయాలనే గొప్ప సంకల్పంతో, బృహత్ ప్రణాళికతో హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకలతో కూడిన నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్) దవాఖానల నిర్మాణానికి కేసీఆర్ అంకురార్పణ చేశారని గుర్తుచేశారు.
వరంగల్ నగరానికి తలమానికంగా 2,200 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 2,000 పడకలతో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టారని వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లా, మండల కేంద్రాల్లో వైద్యశాలలు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖానలను స్థాపించిన చరిత్ర ఆ మహానేత సొంతమని పేర్కొన్నారు.