సిద్దిపేట : హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే రింగ్ మెయిన్ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ( Harish rao ) వెల్లడించారు. మంగళవారం సిద్దిపేటలోని కాళ్ళకుంట కాలనీలో రింగ్ మెయిన్ పైప్ లైన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 32 కోట్లతో 18 కిలోమీటర్ల మేర వాటర్ పైప్ లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా శుద్ధి చేసిన తాగు నీరు అందించానున్నామన్నారు. రింగ్ మెయిన్ బాగా అభువృద్ది చెందిన మహా నగరాలకు మాత్రమే అవకాశముండగా ముందు చూపుతో సిద్దిపేటకు రింగ్ మెయిన్ వేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం 25 ఎంఎండీ లైన్లు వేస్తుండగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 2050 అవసరాలకు అనుగుణంగా 50 ఎం ఎల్ డీ పైప్ లైన్లు వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. వచ్చే రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు.
పైప్ లైన్ నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దిపేట అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని, విద్యాక్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజుల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.