నిజామాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హం గులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్.. ఇందూరు ప్రాంతానికి సరికొత్త ఐటీ సొబగులను తెచ్చిపెట్టింది. బైపాస్ రోడ్డు సమీపంలో ఇప్పటికే సమీకృత కలెక్టరేట్ నిర్మాణం చేపట్టగా.. దీన్ని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో అత్యద్భుతంగా మూడు అంతస్తుల్లో ఐటీ టవర్‌ను నిర్మించడంతో ఇందూరు ప్రాంతం కళకళలాడుతున్నది. ఈ నెలాఖరులో లేదంటే ఆగస్టు తొలి వారంలోనే దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభిస్తామని ట్విట్టర్లో ప్రకటించారు.
ఐటీ టవర్ విశేషాలు
నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీ టవర్ కోసం ఆరేండ్ల క్రితమే కేటాయించారు. ప్రభుత్వం రూ.50 కోట్ల వరకు నిధులు వెచ్చించింది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఐటీ టవర్‌ను.. 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్ విస్తరణ కోసం వదిలేశారు. ఈ మిగులు స్థలాన్ని పార్కింగ్, లాన్, ఇతర అవసరాల కోసం వాడనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఈ టవర్ నిర్మాణాన్ని ఆది నుంచి దగ్గరుండి పర్యవేక్షించారు.
కేటీఆర్ సంకల్పం
పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చొరవ.. ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలతో తెలంగాణకు దిగ్గజ పరిశ్రమలు, ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు క్యూ కడుతున్నాయి. పాత కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ దశలోనే ఐటీ కంపెనీల పెట్టుబడులను తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు మళ్లించడంపై మంత్రి కేటీఆర్ దృష్టిసారించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్‌లో పలు ఐటీ సంస్థలు కార్యకలాపాలు మొదలు పెట్టా యి. ఇప్పుడు ఇందూరు ఐటీ టవర్ ప్రారంభంతో ఆ జాబితాలో నిజామాబాద్ జిల్లా కూడా చేరబోతున్నది. ఇందూరు ఐటీ టవర్‌లో కార్యకలాపాల నిర్వహణకు ఇప్పటికే ఆయా కంపెనీలతో ఐటీ శాఖ ఒప్పందాలను కుదుర్చుకున్నది. టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జాబ్ మేళాను నిర్వహించనున్నారు.