ఆసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు. ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్టలు వెలిశాయి. రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి. అధికార బలమే ఆక్రమణలకు పాల్పడటంతో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వెంట అక్రమణలు మొదలయ్యాయి.
రైతులను భయపెట్టో, నచ్చజెప్పో పొలాలు లీజుకు తీసుకుంటున్న మాఫియా.. ఎల్లంపల్లి నీటికి అడ్డకట్టలు వేస్తున్నది. మొత్తం 30 చెరువులను అక్రమంగా తవ్వి, చేపలు పెంచుతూ ప్రాజెక్టు బహుళ ప్రయోజనాలకు డీలర్-లీడర్ ముఠా గండికొడ్తున్నది.
పెద్ద్డపల్లి, జూన్ 1 (నమస్తే తెలంగాణ)/అంతర్గాం: పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అంతర్గాం మండలం పొట్యాల నుంచి ముర్మూర్ వరకు సోమన్‌పల్లి కేంద్రంగా దాదాపుగా 150ఎకరాల్లో చేపల చెరువులను నిర్మించారు. పొట్యాల, సోమన్‌పల్లి, ఆకెనపల్లి, ముర్మూర్ శివారులో ప్రాజెక్టు భూముల్లో దందా కొనసాగుతున్నది. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని కబ్జా చేసి, మట్టి కట్టలు పోసి, దాదాపు 40 చెరువులు నిర్మించారు. ప్రాజెక్టు నుంచి పైప్లైన్లు వేసి చెరువుల్లోకి నీటిని పంప్ చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం నిల్వకొలతలను ప్రభావితం చేసేస్థాయిలో ఈ వ్యవహారం సాగుతున్నది. అవసరమైన కరెంటును కూడా ట్రాన్స్‌కో విద్యుత్ స్తంభాల ద్వారా అక్రమ కనెక్షన్లతో వాడుకుంటున్నారు. ప్రాజెక్టు నీళ్లలోనే త్రీఫేస్ కరెంటు వైర్లను వేసి, ప్రమాదకర పరిస్థితుల్లో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ నేతలకు మామూళ్లు అందనప్పుడు అధికారులు హడావుడి చేస్తున్నారని, చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బహుళ ప్రయోజనాలకు విఘాతం
అత్యంక కీలకమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.17టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్టీపీసీకి 6 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మంథని, ఆర్ఎఫ్సీఎల్, మంథని నియోజకవర్గంలోని టెయిలెండ్ ప్రాంతాలకు సాగునీటి కోసం 2టీఎంసీలను తరలిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లిని కేంద్రంగా చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-1 నుంచి లింక్-2కు నీటిని అందించేలా నంది పంప్‌హౌస్ నిర్మించారు. రాష్ట్ర సాగునీటి అవసరాల కోసం ప్రధాన వనరుగా తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఏరియాను కొందరు అక్రమార్కులు కబ్జాచేసి.. అక్రమదందాకు తెరతీశారు.
మాఫియా దందా.. రాజకీయ అండ!
ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఏరియాలో పది మంది అక్రమార్కులు ముఠాగా ఏర్పడి చేపల చెరువుల మాఫియాగా ఏర్పడ్డారని తెలుస్తున్నది. ముగ్గురు రైతులకు సంబంధించిన దాదాపు 10ఎకరాలను లీజుకు తీసుకొని, పక్కనే ఉన్న ప్రాజెక్టు భూముల్లో 30-40చెరువులు నిర్మించారు. రామగుండం నుంచి పొట్యాలకు వెళ్లే ప్రధాన రహదారికి కిలోమీటరు దూరంలో, ముర్మూర్ శ్రీపాద పంప్‌హౌస్ వెనుక, ముందు చేపల చెరువులు ఏర్పాటుచేశారు. రవాణాకు అనుకూలంగా లారీలు, వ్యాన్లు తిరిగేలా రోడ్లను ఏర్పాటు చేసుకున్నారు.
నీటినిల్వలకు ఆటంకం
ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వకు అక్రమ చెరువులు ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాకాలం ప్రాజెక్టు నిండుగా ఉన్నప్పుడు బ్యాక్‌వాటర్ చేపల చెరువుల్లోకి రాకుండా కట్టలు వేశారు. ప్రాజెక్టులో నీళ్లు దూరం వెళ్తే ప్రాజెక్టులోనే సరాసరిగా పంపులు వేసి చేపల చెరువుల్లోకి నీరు నింపుతున్నారు. ప్రాజెక్టులో 16టీఎంసీల నీరు ఉంటే చేపల చెరువుల వరకు నీటి ఒత్తిడి ఉంటుంది. దీంతో చెరువులకు నీళ్లు నింపుకోవడం నిర్వాహకులకు సులభమవుతున్నది. 16టీఎంసీల కంటే నీటి నిల్వ తగ్గితే ప్రాజెక్టు లోపలి వరకు వేసిన పైప్లైన్ల ద్వారా నీళ్లు పంప్ చేసుకుంటున్నారు. వేసవిలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం తకువగా ఉంటుంది కనుక రెండో, మూడో పంటకు నీటి ఎద్దడి ఏర్పడకుండా అరకిలోమీటర్ వరకు ప్రాజెక్టు లోపలికి పైప్లైన్లు వేశారు. చేపల చెరువు పకనే ముర్మూర్ భారీ పంపుహౌస్ ఉన్నది. రామగుండంలోనే శ్రీపాద ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగం డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం ఉంది. అయినా అక్రమాలను ఎవరూ అడ్డుకోవడంలేదు.
రైతుల అవసరం.. అక్రమాలకు ఆసరా
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల పకనే పట్టా భూమి కలిగిన రైతులు రూ.20వేలకు ఎకరం చొప్పున చేపల చెరువులకు లీజుకు ఇస్తున్నారు. రూ.10వేలు కౌలురాని పరిస్థితుల్లో ఎకరాకు రూ.20వేలు పొందుతుండడంతో చెరువుల కోసం లీజుకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వీరి వద్ద తీసుకునే ఒకటిరెండు ఎకరాలతో వందల ఎకరాలను కబ్జా చేస్తూ రెచ్చిపోతున్నారు. మిగిలిన 90శాతం చేపల చెరువులను ప్రాజెక్టు భూముల్లోనే ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో ఓ కాంగ్రెస్ నేత అండదండలు ఉన్నట్టు ఆరో పణలు వినవస్తున్నాయి.
మాకు అన్యాయం జరుగుతున్నది
కొందరు అక్రమార్కులు రైతుల భూములను లీజుకు తీసుకొని, పక్కనే ఉన్న ఎల్లంపల్లి భూములను కబ్జా చేశారు. ఆక్రమణలలో చేపల చెరువులను నిర్మించారు. మాకు సరఫరా అవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్తునే దొంగతనంగా చేపల చెరువులకు వాడుతున్నారు. దీంతో మాకు విద్యుత్‌లో ఓల్టేజ్ సమస్య ఎదురవుతున్నది. నిత్యం నీటిని పంపింగ్ చేస్తున్నారు. కోతల సమయంలో ఇబ్బంది పడుతున్నాం.
– ఆకునూరి రవీందర్, సోమనపల్లి, అంతర్గాం మండలం
సర్వే చేసి, నోటీసులు ఇచ్చాం
ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఏరియాలో వందలాది ఎకరాల్లో భూములను కబ్జా చేసి అక్రమంగా చేపల చెరువులను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్‌లోనే ఈ చేపల చెరువులు ఉన్నాయని తేలింది. చెరువులను తొలగించాలని అక్రమార్కులకు నోటీసులు ఇచ్చాం. అంతర్గాం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, వారు కబ్జాలను తొలగించలేదు.
-స్వామి, ఎల్లంపల్లి ఈఈ. బుచ్చిబాబు, డీఈఈ