Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నదని నిర్మాణరంగ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులు మూకుమ్మడిగా ఇసుక లారీలపై దాడులకు దిగడంతో ఇసుకకు కృత్రిమ కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగిపోయాయని చెప్తున్నారు. ఇసుక ధర పెరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అనాలోచితంగా లారీలకు జరిమానాలు విధించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో రూ.1200 వరకు లభించిన టన్ను ఇసుక కొన్ని రోజులుగా రూ.1800-2000లకు చేరుకున్నదని, ప్లాస్టరింగ్‌కు ఉపయోగించే ఫైన్శాండ్ రూ.2100 పలుకుతున్నదని వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొనగా, ఇసుక ధరలు పెరగడంతో నిర్మాణరంగం మరింత కుదేలైందని చెప్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అరికడుతామని చెప్తున్న అధికారులు కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందని నిపుణులు చెప్తున్నారు. అలా వ్యవహరిస్తే ఇసుక రవాణా సజావుగా సాగడంతోపాటు ధరలు నియంత్రణలో ఉండేవని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. క్వారీల వద్ద ఓవర్ లోడింగ్ జరగకుండా చూడడం, అక్రమ క్వారీలను మూసివేయడం, ఎగ్జిట్ పాయింట్ల వద్ద వేబిల్లులు తనిఖీ చేస్తే సరిపోయేదని వివరిస్తున్నారు. కానీ అధికారులు ఇసుక లారీలు రోడ్లపైకి వచ్చాక తనిఖీలు, జరిమానాల విధింపు పేరుతో హడావుడి చేయడం వల్లే లారీల యజమానులు రవాణాను నిలిపివేశారని చెప్తున్నారు.
టీజీఎండీసీ అన్ని పన్నులూ కలుపుకొని టన్ను ఇసుకకు సుమారు రూ.400 వరకు వసూలు చేస్తున్నది. ఈ ప్రకారం 35 టన్నుల ఇసుక లారీకిగాను టీజీఎండీసీకి రూ.14000 చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ఏ ఇసుక క్వారీ నుంచి హైదరాబాద్‌కు ఇసుకను రవాణా చేసినా రూ.15000 కన్నా ఎక్కువ ఖర్చయ్యే అవకాశంలేదని నిర్మాణదారులు చెప్తున్నారు. టోల్ట్యాక్స్లు, లేబర్ ఖర్చులు మరో రూ.6000 అయినా 35 టన్నుల ఇసుకను వినియోగదారుడికి రూ.35000 అందించే అవకాశముందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి, ధరలు అదుపు చేయాలని కోరుతున్నారు.
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.580 కోట్లను దశలవారీగా చెల్లిస్తాం. ఇకనుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు నెలనెలా చెల్లిస్తాం. ఓవర్‌లోడింగ్‌ను అరికట్టేందుకు క్వారీల వద్ద వేబ్రిడ్జీలు, సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తాం. వినియోగదారులకు టన్ను ఇసుకను రూ.1600కు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణాపై 9848094373, 7093914343 నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చు.