హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : తమ చుట్టాలు, పక్కాలకు డీఎస్పీ, ఆర్డీవో ఉద్యోగాలు కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి రూల్స్ మార్చి దొడ్డిదారిన గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇప్పించారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కాదని నిరూపిస్తే బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. 563 పోస్టులకు 1:50 చొప్పున 28,150 మంది మాత్రమే మెయిన్‌కు రావాల్సి ఉండగా..31,382 మందిని ఎలా ఎంపికచేశారు? అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎవరి కోసం ఇంత హడావుడిగా పరీక్షలు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రత్యేకంగా ఒక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా కుట్ర జరుగుతున్నదని చెప్పారు. ‘ఇదేం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ ఎస్టేట్ రిక్రూట్మెంట్ కాదు’ అని మండిపడ్డారు. ఎన్టీఆర్ కంటే రేవంత్‌రెడ్డి గొప్పోడేమీ కాదని, తాను ఇచ్చిన జీవోను 24 గంటల్లో ఎన్టీఆర్ వెనకి తీసుకున్నారని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాల్లో మట్టికొట్టి మొండితనం, మూర్ఖత్వంతో ఎందుకు ముందుకెళ్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్, తుంగ బాలు, కిశోర్గౌడ్తోపాటు గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్తెసరు చదువు చదివారు.. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఆయనకు గ్రూప్-1 పోస్టుల ప్రాధ్యానం గురించి చెప్పాలి’ అని సూచించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ చేయగానే మాట్లాడే రేవంత్‌రెడ్డి.. గ్రూప్-1 అభ్యర్థులను ఎందుకు కలవరు? ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదా?
-దాసోజు శ్రవణ్
టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, సీఎం ఇద్దరూ కలిసి గ్రూప్ -1 అభ్యర్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు సోమవారం తీర్పు ఇచ్చేలోపు జీవోను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలు పరీక్ష ఆలస్యమైతే రేవంత్‌రెడ్డికి ఇబ్బంది ఏమిటి? అని నిలదీశారు. అగ్రవర్ణ మనస్తత్వంతో మహేందర్‌రెడ్డి వ్యవహరించారని ఆరోపించారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55 అన్నివర్గాలకు న్యాయం చేసిందని, రేవంత్‌రెడ్డి సర్కార్ జీవో 29ని తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగుల జీవితాలను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతున్నదని, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కూడా రేవంత్ అడుగుజాడలో నడుస్తున్నారని విమర్శించారు. గ్రూప్-1 ప్రిలిమినరీలో 14 ప్రశ్నలకు తెలుగు అకాడమీ పుస్తకంలోని సమాధానాలు రాస్తే తప్పు అంటున్నారని, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటున్న ప్రభుత్వం వికీపీడియా చెప్పింది ఎలా ప్రామాణికమవుతుందో చెప్పాలని నిలదీశారు. కోర్టుకు వెళ్లి పరీక్షకు ఒక్కరోజు ముందు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందారని గుర్తుచేశారు. వారు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు? ఎలా పరీక్ష రాస్తారు? అని ప్రశ్నించారు. హిట్లర్ కంటే దారుణంగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన నిరుద్యోగులే సమయం వచ్చినప్పుడు రేవంత్‌రెడ్డికి కర్రుకాల్చి వాతపెడతారని హెచ్చరించారు.
గ్రూప్స్ అభ్యర్థులకు తెలంగాణభవన్ కేంద్రంగా మారిందని, అభ్యర్థులు తమ బాధలు చెప్పుకోవడానికి పెద్దసంఖ్యలో తరలివచ్చారని దాసోజు శ్రవణ్ చెప్పారు. నిరుద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు అశోక్‌నగర్‌కు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ ఇతర నాయకులమంతా కలిసి వెళ్లామని తెలిపారు. బీఆర్ఎస్కు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనని, ఎకడ ఈటల రాజేందర్ హైలైట్ అవుతారోనని బండి సంజయ్ అశోక్‌నగర్ నుంచి బరాత్ తీశారని ఎద్దేవాచేశారు. తమను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. సంజయ్‌ని మాత్రం తన పార్టీ కార్యాలయంలో వదిలేశారని విమర్శించారు. డ్రామా చేసి నిరుద్యోగుల సమస్యను బండి సంజయ్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. తనను అడ్డుకున్నాడనే ఆగ్రహంతో బీసీవర్గానికి చెందిన సీఐని బండి సంజయ్ బదిలీ చేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడటం తగదని సూచించారు. ‘ఎవరైనా నీ అవ్వ.. అంటారా?’ అని నిలదీశారు. ఎవరికైనా అమ్మ అమ్మే అవుతుందని, ఇదేనా తల్లిదండ్రుల పట్ల ఆర్ఎస్ఎస్ ఆయనకు నేర్పిన సంస్కారం? అని ప్రశ్నించారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేసే దమ్ముంటే సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లను పెట్టి నిరుద్యోగుల తరఫున వాదించాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో 29ని రద్దు చేసి గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేటర్ మనస్తత్వాన్ని బండి సంజయ్, జడ్పీటీసీ మనస్తత్వాన్ని రేవంత్‌రెడ్డి వీడడం లేదు. ఓ చానల్ ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి తాను రాజకీయ నేతను కాకపోయి ఉంటే రౌడీని అయ్యేవాడిని అన్నడు. అంటే ఇప్పుడు నిరుద్యోగులపై రౌడీ బుద్ధి చూపిస్తున్నవా?
జీవో 29 వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. అభ్యర్థుల ఒపీనియన్ తీసుకొని గరిష్ఠ సభ్యుల అభిప్రాయం మేరకు పరీక్ష నిర్వహించాలి. ఏకపక్షంగా గ్రూప్-1 పరీక్ష నిర్వహించడం తగదు. అన్ని కేసులు పరిష్కారమైన తర్వాతే పరీక్షలు సజావుగా నిర్వహించాలి. మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించారు. కానీ, వారికి వచ్చిన మార్కులు, క్యాటగిరీ, కటాఫ్ వంటివి వెల్లడించలేదు. నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించాలి.
జనరల్, రిజర్వుడు, లోకల్, నాన్ లోకల్, స్పోర్ట్స్ కోటా కటాఫ్ మార్కులు ఎన్ని? ఆ వివరాలు ఎందుకు చెప్పరు? గ్రూప్-1 మెయిన్స్‌కు బీసీ అభ్యర్థులను 1:50, ఓసీలను 1:65 నిష్పత్తిలో ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు?