రవీంద్రభారతి,నవంబర్ 29: ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఫీజుల పోరుసభలో ఆయన ప్రసంగించారు.
పైసా ఫీజు, స్కాలర్‌షిప్పుల బకాయిలు చెల్లించకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం సిగ్గుచేటని, ఏమి సాధించారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు ఫీజులు చెల్లించేందుకు రక్తాన్ని, కిడ్నీలను అమ్ముకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్టర్లకు మాత్రం ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నదని, విద్యార్థుల ఫీజులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మంత్రి భట్టి విక్రమార్క స్పందించాలని, విద్యార్థుల ఫీజు, స్కాలర్‌షిప్పుల బకాయిలను చెల్లించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులను పట్టించుకోకపోతే గతంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి పట్టడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ నేతలు నీల వెంకటేశ్, గొరిగే మల్లేశ్‌యాదవ్, గుజ్జ సత్యం, నందా గోపాల్, పగ్గెల సత్యం, వంశీ, చంద్రశేఖర్, మోదీ రాందేవ్, నర్సింహ, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.