హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) బీఆర్ఎస్ను (BRS) దెబ్బతీసేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి బీఆర్ఎస్ను ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల చిహ్నాల కేటాయింపు దాకా కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరేలా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడినా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తూ, బీఆర్ఎస్ పార్టీని మాత్రం అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అభిప్రాయం నెలకొన్నది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని నామినేషన్లు వేసిన కాంగ్రెస్ బాధితులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున నామినేష్లను తిరస్కరించారని చెప్తున్నారు. అయినప్పటికీ 58 మంది అభ్యర్థులు పోటీలో మిగలడంతో గుర్తులతో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు తెరతీశారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. కారును పోలి ఉన్న గుర్తులను తొలగించాలని గత జూలై 15న బీఆర్ఎస్ సీనియర్ నేతలు వినోద్‌కుమార్, సోమ భరత్‌కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. బీఆర్ఎస్ నేతల వినతిని పరిగణనలోకి తీసుకోకుండా ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓట్లను చీల్చాలన్న లక్ష్యంతోనే కారును పోలిన గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చపాతీ రోలర్, కెమెరా, ఓడ గుర్తులు కారును పోలి ఉండటంతో బీఆర్ఎస్ ఓటర్లు కన్ఫ్యూజన్కు గురవుతున్నారు. వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు దానిని పోలి ఉన్న గుర్తులకు పడుతున్నాయి. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో స్వతంత్ర, గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించారు. కారు గుర్తుకు పడాల్సిన వందలాది ఓట్లు చపాతీ రోలర్, కెమెరా, ఓడ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులకు పడ్డాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. చపాతీ రోలర్, కెమెరా, ఓడ గుర్తులను పూర్తిగా తొలగించాలని వినతిపత్రం అందజేశారు. కానీ, ఎన్నికల కమిషన్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వినతిని పట్టించుకోలేదు. తమ అభ్యర్థనను పట్టించుకోకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్నికల అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్కు నష్టం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నది. పదేండ్లు జూబ్లీహిల్స్ ప్రజలకు అన్ని విధాలా సేవలందించిన మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఓడించేందుకు అడ్డదారులు తొక్కుతున్నది. రెండేండ్ల కాంగ్రెస్ అరాచకాలు, మోసాలకు బలైన బాధితులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు ముందుకొస్తే.. అధికారం బలంతో అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. అయినా భారీగా నామినేషన్లు దాఖలు కావడంతో ఓటమి భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉండటంతో బీఆర్ఎస్ ఓట్లు చీల్చే కుట్రకు శ్రీకారం చుట్టింది. అటు ప్రచారంలో అవాంతరాలు సృష్టిస్తూ.. ఇటు ఎన్నికల గుర్తుల ద్వారా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ఓటర్లు వారి మోసాలను ఎండగడతారని, జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరేస్తామని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టంచేస్తున్నారు.