Telangana | (ఖమ్మం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)/ ఖమ్మం, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయులను పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో మంగళవారం పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు. వరద సహాయక చర్యల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ భాగస్వామ్యం పంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరి 24 గంటలు కూడా కాకముందే.. సహాయక చర్యల కోసం, బాధితులకు భరోసా ఇచ్చేందుకు వచ్చిన బీఆర్ఎస్ కీలకనేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఉదయం 11 గంటలకు పాలేరు నియోజకవర్గం, కరుణగిరిలో ఉన్న రాజీవ్ స్వగృహ కాలనీలోని వరద బాధితులను మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు.
అనంతరం ఖమ్మంలోని బొక్కలగడ్డ, మంచికంటినగర్, సారథినగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో మంచికంటినగర్‌లో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారు. బీఆర్ఎస్ నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తుండడం, సహాయక చర్యల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, కేసీఆర్ హయాంలోనే తమకు సత్వర న్యాయం లభించిందని, పువ్వాడ తమను ఆదుకున్నారని బాధితులు చెప్తుండడంతో తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ గూండాలు కయ్యానికి కాలుదువ్వారు. తొలుత నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గమనించిన హరీశ్‌రావు తదితరులు సంయమనం పాటించాలని బీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు.
పువ్వాడ కారు అద్దాలు ధ్వంసం
మంచికంటినగర్ ఆర్చి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అకస్మాత్తుగా దాడిచేసి పువ్వాడ కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. వరద బాధితులు వారికి ఎదురుతిరిగి ‘మీరు ఎలాగూ రారు.. వచ్చిన వారినీ రానివ్వారా?’ అని వాగ్వాదానికి దిగారు. హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి, అజయ్‌కుమార్, వద్దిరాజు, కేపీ వివేకానంద, శంభీపూర్‌రాజు, కౌశిక్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులకు వరద బాధితులు రక్షణకవచంగా నిలిచారు. దీంతో మరింతగా రగిలిపోయిన దుండగులు వరద బాధితులపై దాడిచేశారు. ఈ ఘటనలో ఒకరి తలపగిలి గాయాలయ్యాయి. కారులో తిరిగి వెళ్తున్న హరీశ్‌రావు బృందంపై మంచికంటినగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోమారు దాడికి తెగబడ్డారు. పెద్ద బండరాయితో ఆయన కారుపై దాడిచేసి అద్దాన్ని ధ్వంసం చేశారు. మరో వ్యక్తి కూడా హరీశ్ కారుపై బండరాయితో రాగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు యావన్నగారి సంతోశ్‌రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అల్లరిమూకలు సంతోష్‌రెడ్డిని కారు కిందకు నెట్టడంతో ఆయన కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. రాళ్లదాడిలో వరదబాధితులు షేక్ అఫ్జల్, అంజాద్ పాషాకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గురిని ఖమ్మంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు.
ముందస్తు ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందా?
బీఆర్ఎస్ బృందంపై దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందా? అన్న అనుమానం కలుగుతున్నది. ఇద్దరు కార్పొరేటర్ల భర్తల పర్యవేక్షణలోనే దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. ‘మిక్కిలినేని నరేందర్, ముస్తాఫా’ అనే కాంగ్రెస్ నేతలే దాడికి ఉసిగొల్పినట్టు ఆరోపణలు వస్తున్నాయి. నరేందర్ సోమవారం ఖమ్మంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో పాల్గొనడం గమనార్హం.
సీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు…
మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, డ్రైవింగ్ స్థానంలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దుండగులు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు ఖమ్మం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మిక్కిలినేని నరేందర్, బాణాల లక్ష్మణ్, ఎస్కే యాకూబ్‌బాషా, ఎండీ షుకూర్, ఎస్కే యూసుఫ్, నిమ్మలబోయిన సురేశ్, ఇఫ్తికర్ హుస్సేని అలియాస్ భద్రుల్లా ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు.