హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంగుతిన్నది. రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నా మెజారిటీ స్థానాలను గెలుచుకోలేక చతికిలపడింది. పల్లెపల్లెనా వ్యతిరేకతను మూటగట్ట్టుకున్నది. 2019 సర్పంచ్ ఎన్నికల సమయంలో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల ఆదరణతో మెజారిటీ స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించగా… నేడు అందుకు విరుద్ధంగా ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అత్తెసరు స్థానాలు దక్కించుకున్నది. బీఆర్ఎస్ మాదిరిగా ప్రజల ఆదరణను పొందలేకపోయింది. ఏకగ్రీవాలు కాకుండా పోలింగ్ జరిగిన స్థానాల్లో కనీసం సగం స్థానాలను కూడా గెలుచుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్‌కు గులాబీ శ్రేణులు ఎదురునిలిచాయి. పల్లెపల్లెనా సవాల్ విసిరాయి. బీఆర్ఎస్ పార్టీ పల్లె ప్రజల అభిమానాన్ని చూరగొన్నది.
నాడు 68% స్థానాలు బీఆర్ఎస్వే
2019 పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 12,609 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులో నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. మూడు విడతల్లో జరిగిన ఆ ఎన్నికల్లో మొత్తంగా 8,606 స్థానాలను (68.26%) బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు. అవికాకుండా ఏకగ్రీవాలను కూడా కలుపుకుంటే దాదాపు 75% స్థానాలు గులాబీ ఖాతాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం మూడు విడతల్లో 12,735 పంచాయతీలకు ఎన్నికలు జరగాయి. అందులో ఏకగ్రీవాలు కాకుండా పోటీ జరిగిన చోట్ల అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు మొత్తంగా గెలిచింది 5,994 స్థానాలే. అంటే 46 శాతమే. అందులోనూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం సాగించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో మోహరించారు. గ్రామీణులను అనేకవిధాలుగా ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన నేతలపై దాడులకు దిగారు. అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారు. సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించారు. అయినప్పటికీ పల్లె ప్రజల అభిమానాన్ని పొందలేకపోయారు. స్థానిక సమరంలో బొటాబొటీ మెజారిటీతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకున్నది. నాటి బీఆర్ఎస్ గెలిచిన స్థానాలతో పోల్చితే 22.26% స్థానాలు తక్కువగానే గెలిచింది.
ప్రతిపక్షంలో ఉన్నా గులాబీ రెపరెపలు
2019 పంచాయతీ ఎన్నికల్లో 12,609 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు అత్యల్ప స్థానాలు గెలుచుకున్నారు. మూడు విడతల్లో జరిగిన ఆ ఎన్నికల్లో మొత్తంగా 2,486 స్థానాలు (19.71%) మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నా కూడా గులాబీ సత్తా చాటింది. అధికారపక్షానికి ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీనిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. మూడు విడతల్లో పోలింగ్ జరిగిన పంచాయతీల్లో 3,728 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు జెండా ఎగురవేశారు. మూడు విడతల్లో మొత్తంగా 1,193 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయిస్తే ఎన్నికలు జరిగిన స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తేడా స్వల్పంగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. దీంతో బీఆర్ఎస్పై ప్రజలకు ఉన్న ఆదరణ, కాంగ్రెస్‌పై గ్రామీణ ఓటర్లలో ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైపోతున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ స్థాయిని అందుకోలేపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీ మూడు విడతల్లో కలిపి 637 స్థానాలతోనే సరిపెట్టుకోగా, ఇతరులు 1,134 స్థానాలను గెలుచుకున్నారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీదే హవా కొనసాగుతుంది. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. కానీ, ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. అత్యధిక స్థానాలు గెలుచుకోవడంలో విఫలమైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్‌కు చెమటలు పట్టించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనేలా పోటీపడ్డారు. బీఆర్ఎస్ ప్రతిఘటనతో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పలేదు. ఈ ఫలితాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశించిన స్థాయిలో చేరదీయలేదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు. అంటే ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత గూడుకట్టుకున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.
ఏకగ్రీవాలు కాకుండా ఎన్నికలు జరిగిన స్థానాల్లో గెలుచుకున్న స్థానాలు 3 విడతల్లో
