వర్ధన్నపేట, జూలై 11 : ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడమే గాక తప్పుడు ఆరోపణలకు సిద్ధపడుతున్నదని ఆయన పేర్కొన్నారు.
తనపై కొంతమంది అధికార పార్టీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తనపై ఎలాంటి కేసులు నమోదు చేసినా భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రెండేండ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడంతో ప్రజల కనీస అవసరాలు తీరడంలేదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయాలని కోరారు.