హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. నేడు, రేపు అంటూ ఊరించి, చివరికి అసలు కమిటీ తప్ప మిగతావి ప్రకటించి ఉసూరుమనిపించింది. రాష్ట్రంలో రాజకీయ వ్యవహారాలు, అడ్వైజరీ, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రొగ్రామ్, క్రమశిక్షణ కమిటీలను గురువారం ఏఐసీసీ ప్రకటించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాలు, 15 మందితో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ రెండింటికీ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సారథ్యం వహించనున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలన్నీ ఆమె కనుసన్నల్లోనే నడువనున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. డీలిమిటేషన్ కమిటీలో ఏడుగురు, సంవిధాన్ బచావో కమిటీలో 16 మంది, క్రమశిక్షణ కమిటీలో ఆరుగురికి చోటు కల్పించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదరరాజనర్సింహ ఇతర నేతలకు చోటు కల్పించారు. అడ్వైజరీ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలను చేర్చారు.
డీలిమిటేషన్ కమిటీ చైర్మన్‌గా చల్లా వంశీ చంద్‌రెడ్డిని నియమించగా, సంవిధాన్ బచావ్ కమిటీ చైర్మన్‌గా పీ వినయ్‌కుమార్ వ్యవహరించనున్నారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా చిన్నారెడ్డి స్థానంలో ఎంపీ మల్లు రవికి బాధ్యతలు అప్పగించారు. వైస్ చైర్మన్‌గా ఏ శ్యామ్ మోహన్, సభ్యులుగా ఎం నిరంజన్‌రెడ్డి, బీ కమలాకర్ రావు, జాఫర్ జావెద్, జీవీ రామకృష్ణలను నియమించారు. అయితే.. కీలకమైన కార్యవర్గం ప్రకటన కోసం నేతలంతా ఎదురుచూస్తుండగా, ఏఐసీసీ ఆ విషయాన్ని పక్కనబెట్టడంపై రాష్ట్ర నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీకి నూతన చీఫ్ నియామకమై ఏడాది కావస్తున్నా కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడంపై రగిలిపోతున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత త్వరలో కార్యవర్గం ప్రకటన వస్తుందని చెప్పారని, ఆచరణలో దాని ఊసేలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాలని ఆశావహులు ఆక్రోషం వెళ్లగక్కుతున్నారట.