Srinivas Goud | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తేతెలంగాణ): కల్తీ కల్లు పేరుతో ప్రభుత్వం గీత కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు యథేచ్ఛగా కొనసాగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నది ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, రాంచందర్‌నాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ పాలు, నూనెలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులను వదిలి వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గౌడ్లను వేధిస్తున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న కల్లు దుకాణాల మూసివేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది పూర్తయినా గీత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పెంచుతామని మొండిచెయ్యి చూపిందని, వైన్‌షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు పెంచుతామన్న హామీకి అతీగతీలేదని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని, జనగామ జిల్లాకు ఆయన పేరు పెడతామని ఇచ్చిన మాటలు మరిచిందని మండిపడ్డారు. గీత కార్మికుల రక్షణకు కేసీఆర్ హ యాంలో తయారు చేయించిన సేఫ్టీ మోకుల ను పంచి తమ ఘనతగా చెప్పుకోవడం సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే లక్షమంది గౌడకులస్తులతో భారీ బహిరంగ సభ నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.