హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత టీడీపీ కోసం దొడ్డిదారిలో విలీన మండలాల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారని, దానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని దుయ్యబట్టారు.
ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాడు తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నాడు అసెంబ్లీలో, పార్లమెంట్లో అలుపెరగని పోరాటం చేశామని చెప్పారు. 2014లో జూలైలో జరిగిన పార్లమెంట్ సమావేశాల కంటే ముందే.. మే 29న బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని వివరించారు.
విలీన ప్రక్రియను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో మాట్లాడారని తెలిపారు. ఈ సందర్భంగా తాము లోక్‌సభలో విలీన మండలాల ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించారు. వాటిని లైవ్‌లోనే జీవన్‌రెడ్డికి పంపారు. బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా పోలవరానికి మేలు చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను విలీనం చేశారని పేర్కొన్నారు. ఈ అనాలోచిత ఆర్డినెన్స్ వల్ల తెలంగాణ 500 మెగావాట్ల సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని కోల్పోయిందని వివరించారు.
బంద్‌లు చేసిందే బీఆర్ఎస్..
మండలాల విలీనాలను వ్యతిరేకిస్తూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ పాటించామని వినోద్‌కుమార్ చెప్పారు. నాడు భద్రాచలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా బంద్‌కు మద్దతు తెలుపలేదని విమర్శించారు. లోక్‌సభలో బిల్లు ఆమోదించుకున్న బీజేపీ, కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాజ్యసభలోనూ ఆమోదించారని చెప్పారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నారని, తన గురువు చంద్రబాబు చెప్పిన విధంగా మద్దతు తెలిపారని అన్నారు. అలాంటి కాంగ్రెస్ నేతలు ఆనాడు బీఆర్ఎస్ మౌనంగా ఉన్నదని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు.
ప్రజలతోనే గులాబీ జెండా
గెలుపు, ఓటములు శాశ్వతం కాదని.. సూర్యడు, భూమి ఉన్నంతకాలం గులాబీ జెండా తెలంగాణ ప్రజల పక్షానే కొట్లాడుతుందని వినోద్‌కుమార్ చెప్పారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకొనిరాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసీఆర్ వందల లేఖలు రాసినా, పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడినా కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తాము పదేండ్లలో చేసిన పనులు, ఇచ్చిన ఉద్యోగాలు, వెలవరించిన నోటిఫికేషన్లు, తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి జనవరి తర్వాత క్షుణ్ణంగా వివరిస్తామని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రవీందర్‌రెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.