చంపాపేట, జూలై 21: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలకు రాష్ట్ర ప్రజానీకం మోసపోయిందన్నారు. కేసీఆర్‌ను కాదనుకొని కంపల పడ్డామని, ప్రస్తుతం నెత్తినోరు బాదుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. అందులో తాను సైతం ఒక్కడినని చెప్పారు.
ఆ పార్టీ నిజస్వరూపమేమిటో తనకు జ్ఞానోదయమై సొంత గూటికి బీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్‌లో పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కాంగ్రెస్‌లో రాజకీయంగా ఏ మాత్రం ఎదగనివ్వక పోవడమే కాకుండా వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ కాదన్నారు. బహుజన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒరిగేదేమీ లేదని విమర్శించారు. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని ఆయన జోస్యం చెప్పారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు తన వంతు కృషి అందిస్తానన్నారు.