ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కలుపుకొని, బీఆర్ఎస్ పాలన ముగిసేనాటికి రాష్ట్ర అప్పు కేవలం 3.5 లక్షల కోట్లే. ఈ నిజాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా ఒప్పుకొన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్ ఇప్పుడేమంటరు? అస్తవ్యస్త విధానాలతో రాష్ర్టాన్ని అప్పుల పాల్జేస్తున్నది అసమర్థ కాంగ్రెస్సే!
-కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని గాయిగాయి చేసిన రేవంత్‌రెడ్డి చెంపచెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వరిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు కాదని, కేవలం 3.5 లక్షల కోట్లేనన్న నిజాన్ని స్వ యంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా సోమవారం ఒప్పుకొన్నదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్‌రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలన్న సంగతి పార్లమెంట్లో ఇవాళ కేంద్ర మంత్రి సమాధానంతో నిరూపితమైందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి రూ.8 లక్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్రచారానికి దిగిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ముఖం ఎకడ పెట్టుకుంటారని సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
తాము అధికారం నుంచి దిగిపోయిన తరువాత అంటే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.3,50,520.39 కోట్లు మాత్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా తలకు మించిన అప్పులు చేయలేదని తెలిపారు. సంక్షేమ పథకాలకే కాకుండా, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి కోసమే అప్పులను ఉపయోగించిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేసిందని వివరించారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ, సమర్థతతోనే రాష్ట్రం వేగంగా పురోగమించిందని స్పష్టం చేశారు.
అప్పులు చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆస్తులు పెంచడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. తాను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే విపరీతంగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. 2023 డిసెంబర్ నుంచి అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ మార్గాల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల కంటే ఎకువ అప్పులు చేసినట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అంగీకరించిన సంగతిని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే 20,266 కోట్లు అప్పు చేశారని తెలిపారు.
ఒక కొత్త ప్రాజెక్టు కట్టకుండానే, హామీ ఇచ్చిన ఏ ఒక సంక్షేమ పథకాన్ని అమలుచేయకుండానే రేవంత్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వ అనాలోచిత, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆటో-పైలట్‌లో ఉన్నదని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు.. ఈ పరిస్థితిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉన్నదో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కేంద్రం ఇచ్చిన గణాంకాలపై ఏం సమాధానం చెప్తారని కేటీఆర్ ప్రశ్నించారు. నిజాలు తెలుసుకుని, నిరాధారమైన ఆరోపణలు మానుకొని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని హితవుపలికారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనతో తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఆరు గ్యారెంటీల అమలు సంగతేమో గానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాత్రం రేవంత్ సర్కారు గ్యారెంటీగా ఖతం పట్టించిందని ధ్వజమెత్తారు. కాగ్ ఇచ్చిన తాజా నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూనే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తలకిందులైందని మండిపడ్డారు. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం పడిపోవడంతోపాటు అప్పులు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణ.. ఇప్పుడు రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటును ఎదురోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. పన్నేతర ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని, బడ్జెట్లో అంచనా వేసిన దానిలో కేవలం 3.37 శాతం మాత్రమే వసూలైందని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి ప్రతి రోజూ అప్పు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఈ సంవత్సరంలో ఇప్పటికే 20,266 కోట్లు అప్పు చేసింది. వార్షిక లక్ష్యంలో ఇది 37.5 శాతం. కొత్తగా ఎక్కడా రోడ్డు వేయకుండా.. ఒక ప్రాజెక్టును కూడా ప్రారంభించకుండా, విద్యార్థులకు కనీసం మంచి భోజనమైనా పెట్టకుండా ఈ నిధులను ఏం చేస్తున్నదో ప్రభుత్వం చెప్పాలి.
-కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవహరాలను తెలివిగా నిర్వహిస్తూ.. అప్పుల కంటే ఎక్కువ ఆస్తులను సృష్టించిందని కేటీఆర్ గుర్తుచేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ.3,50,520.39 కోట్లు అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ రూ.4,15,099.69 కోట్లుగా ఉన్నదని తెలిపారు. అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎకువగా ఉన్నదని పేర్కొన్నారు. ఆరు ఆర్థిక సంవత్సరాలలో (2018-19 నుంచి 2023-24 వరకు) ప్రతి ఏటా తెలంగాణ అప్పుల కంటే ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లకుపైగా పెరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థతకు ఈ గణాంకాలే నిదర్శనమని కేటీఆర్ వివరించారు.
‘తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కా దిగా సరిపోయిందన్నట్టు రేవంత్ సర్కారు తీరు ఉన్నదని కేటీఆర్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. రైతుబీమా అమలులో సర్కారు కొర్రీలపై ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదేపదే దరఖాస్తు చేసుకోవడానికే సమయం సరిపోతున్నదని వాపోయారు. కాంగ్రెస్ పాలనలో ఒక పథకం కూడా నిర్దిష్టంగా అమలు కావడం లేదని విమర్శించారు. భూమిని నమ్ముకున్న రైతు ఏ కారణం చేత మరణించినా ఆ కుటుంబానికి అందించే రూ.5 లక్షల రైతుబీమా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి అమలు చేయడం ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ స్కీం ప్రారంభించినప్పటి నుంచి 2023 డిసెంబర్ వరకు 1,11,320 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించినట్టు వెల్లడించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా జాప్యం చేయడం మూలంగా వేలాదిమంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుందని, ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీగా వస్తున్నదని పేర్కొన్నారు. గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతులు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు అందజేయాలని కాంగ్రెస్ సర్కారు నిబంధన పెట్టిందని మండిపడ్డారు.
బీమా రెన్యువల్‌కు కేవలం మూడు రోజుల గడువే ఉన్నదని గుర్తుచేశారు. వ్యవసాయ పనులు జోరుగా నడుస్తున్న తరుణంలో ఎరువులు దొరక రైతులు చెప్పులు, పట్టాదారు పాస్ పుస్తకాలను లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసినట్టే రైతుబీమా రెన్యువల్‌ను సమయానికి చేయాలని, దరఖాస్తుల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాలు, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా ఎవరి మీద ఆ రాయి విసురుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తప్పితే సామాన్యులకు దమ్మిడీ విదిల్చింది లేదని విమర్శించారు. బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప 20 నెలల కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు, తెలంగాణకు ఒరిగిందేమీ లేదని దెప్పిపొడిచారు.