వనపర్తి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని ఓటర్లకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వనపర్తిలో ఏర్వ సాయిప్రసాద్ యాదవ్‌తోపాటు పలువురు యువకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరగా నిరంజన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాలకు ఎక్కువ డబ్బులు ఇస్తామంటే ప్రజలు నమ్మి మోసపోయారని తెలిపారు.
అస్తవ్యవస్తంగా రుణమాఫీ పథకం, రైతు బంధు రెండు విడుతలకు ఎగనామం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఊసేలేదని, వృద్ధులకు డబుల్ పింఛన్ జాడ లేదని.. ఇలా ఏ హామీ చూసినా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మోసాలకు బలైనట్టు చెప్పారు. ఇటీవల యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులను అందినకాడికి దోచుకుతిన్నారని, ఒక్కో లారీకి పది క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు తరుగు, ఇతరత్రావాటి పేరుతో ప్రభుత్వం దోపిడీ చేసిందని విమర్శించారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు చెప్పి కాంగ్రెస్.. నేడు గ్రామాల్లో నిబంధనల పేరుతో అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఇంటి నిర్మాణం ఒక్క ఫీటు పెరిగినా బిల్లు రాదంటూ అధికారులతో షరతులు పెట్టించి నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లిందని మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ద్వారానే సంక్షేమ పథకాలన్నీ సవ్యంగా సాగుతాయన్న ఆశను ప్రజలు చెప్తున్నారని అన్నారు.