వరంగల్, డిసెంబర్ 17 : ‘దశాబ్దాల కాలంగా పార్టీ జెండా మోస్తూ కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులను చిల్లరగాళ్లు అంటావా? పార్టీలు మారిన నిన్ను ఆ చిల్లరగాళ్లే కష్టపడి గెలిపించారని మర్చిపోవద్దు’ అని వరంగల్ తూర్పు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంత్రి సురేఖకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఓ రౌడీ చేతిలో నియోజకవర్గ భవిష్యత్తును పెడితే పార్టీనే నమ్ముకున్న నాయకులు ఊరుకోరని హెచ్చరించారు. బుధవారం గ్రేటర్ వరంగల్లోని ఎల్బీ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నల్లగొండ రమేశ్, కార్పొరేటర్ గుండేటి నరేందర్, పలువురు సీనియర్ నాయకులు మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ సీనియర్ నాయకులను చిల్లరగాళ్లు అంటూ సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏండ్లతరబడి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఓ మాజీ రౌడీ షీటర్ వద్ద క్యూ కట్టే పరిస్థితి కల్పించారని మంత్రిపై మండిపడ్డారు. కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యేను కలవాలంటే ఓ అనామకుడి అనుమతి తీసుకోవాల్సి పరిస్థితి దాపురించిందని, ఇంతకంటే చిల్లరవేశాలు ఏముంటాయని ప్రశ్నించారు.
ప్రతి ఎన్నికలో పార్టీ మారిన ఘనత మీకే దక్కుతుందని మంత్రి సురేఖపై ధ్వజమెత్తారు. ‘పార్టీని నమ్ముకొని పని చేస్తున్న నాయకులను విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. పార్టీ పరువును బజారు కీడుస్తూ చిల్లర పనులు చేస్తున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన కార్పొరేటర్లను అక్కున చేర్చుకొని, పార్టీ జెండా మోసిన నాయకులకు అన్యాయం చేశారు. సీనియర్లను చిల్లరగాళ్లు అన్న మాటను తక్షణమే వెనక్కి తీసుకోవాలని మంత్రి సురేఖను డిమాండ్ చేశారు.