రెండేండ్ల కిందట ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాహుల్‌కు ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రం యాదికొచ్చింది. ఓట్లేసి గెలిపించిన జనం ఇన్నాళ్లు కనిపించలేదుగానీ, ప్రజాధనంతో నిర్వహించిన సరదా మ్యాచ్ కదిలించింది. నాడు రాష్ట్రమంతా తిరిగేందుకు షెడ్యూల్ సెట్ అయ్యింది, ప్రజలందరినీ కలిసే అవసరం పడిందిగానీ పార్టీ గద్దెనెక్కినంక బాగోగులు చూసేందుకు దారి దొరకలేదు. సమస్యలు తీర్చండని జనమంతా రోడ్డెక్కితే పట్టించుకోని రాహుల్‌కు కోట్ల దుబారాను చూడడానికి విరామం లభించింది. జనంగోడు పట్టని సర్కార్‌ను గాడిలో పెట్టడానికి టైం లేకుండేగానీ, ఐదునిమిషాల మ్యాచ్‌కు ప్రత్యేక విమానం సమకూరింది.
181 మంది ఆటో డ్రైవర్ల బలవన్మరణం పట్టలే., అశోక్‌నగర్ నిరుద్యోగులకు చేసిన బాస గుర్తులే., 828 మంది అన్నదాతలు ప్రాణాలొదిలినా తొంగిచూడలే., యూరియా గోస చూసిందిలే., బీసీ డిక్లరేషన్ ప్రస్తావన పట్టింపులే., సిగాచిలో మసైన కార్మికుల కంటిధారలూ ఆయనను కదిలించలే., ప్రభుత్వ పాఠశాలల్లో 117 మంది విద్యార్థులు మరణించినా, విషాహారం తిని 2188 మంది గురుకులాల విద్యార్థులు దవాఖానల పాలైనా ఆయనలో కనికరం పుట్టించలే. 48 మంది చేనేత కార్మికులు మరణిస్తేనేమీ., ‘హైడ్రా’ పైశాచికం పేదలపై విరుచుకుపడి ఆగమాగం చేస్తేనేమీ, ఆఖరుకు లగచర్ల రైతుల చిత్రవధలు కదలించలేదు, హోంగార్డు, బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆకలికేకలు చలనం పుట్టించలేదుగానీ, ఒకే ఒక్కమ్యాచ్, అందునా వంద కోట్లు వెచ్చించి నిర్వహించిన ఆట చూడడానికి మాత్రం రాహుల్‌గాంధీకి రాష్ట్రం గుర్తుకొచ్చింది. స్పెషల్ ఫ్లైట్‌లో వచ్చారు, మెస్సీ, రేవంత్ మ్యాచ్ చూసి తరించారు. ఏదీఏమైనా రాహుల్‌కు తెలంగాణకు రావడానికి ఇలా వీలు కుదిరింది.
హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎట్టకేలకు హైదరాబాద్‌కు (Hyderabad) వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి ప్రదక్షిణలు చేసినా, విగ్రహాల ఆవిష్కరణకు రావాలని ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో విన్నపాలు పంపినా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్‌గాంధీకి ఇప్పుడు తీరిక దొరికింది. అయితే.. ఆయన వచ్చింది తెలంగాణ బీసీ ప్రజల పోరాటానికి, ధర్నాలకు మద్దతు ఇవ్వడానికి కాదు, రెండేండ్లలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విషాహారం తిని చనిపోయిన పిల్లల కుటుంబాలను పలుకరించటానికి కాదు, బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ అయ్యి కింగ్‌కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించేందుకు అసలేకాదు.
అదానీ గ్రూప్ స్పాన్సర్షిప్ చేస్తున్న మెస్సీ ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తిలకించేందుకు రాహుల్‌గాంధీ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. లగచర్ల గిరిజన రైతులను వేధించి, బెదిరించి, జైలులో పెట్టినప్పుడూ రాహుల్ స్పందించలేదు. హైదరాబాద్‌లో బుల్డోజర్లు పేదల జీవితాలను నాశనం చేస్తున్నప్పుడు సందర్శించలేదు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని కంచె గచ్చిబౌలి అడవిలో జరిగిన ప్రకృతి విధ్వంసంపైనా మాటమాత్రంగానైనా మాట్లాడలేదు. కానీ ఉప్పల్ స్టేడియంలో కేవలం 5 నిమిషాలపాటు మెస్సీ ఆడే మ్యాచ్ చూడటానికి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు.
తెలంగాణ కులగణన, బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అని, దేశానికి మాడల్ అని కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన హామీని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారు. ఏడాది తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. పార్లమెంటులో బిల్లులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తెలంగాణ బీసీ సంఘాల నాయకులు, అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆగస్టులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకు అగ్రనేత రాహుల్ డుమ్మా కొట్టారు. ఆ రోజు ఆయనకు పెద్దగా అధికారిక కార్యక్రమాలు లేవని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు అప్పట్లోనే పేర్కొన్నాయి.
అయినా కనీసం ఐదు నిమిషాలపాటు ధర్నాలో పాల్గొని బీసీ ప్రజల హక్కుల పోరాటానికి మద్దతు ఇవ్వలేదు. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి కూడా బీసీ బిల్లు జాప్యం మీద ఒక్క ప్రశ్న లేవనెత్తలేదు. చివరికి ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు కూడా రాహుల్ గాంధీ ముఖం చాటేశారు. అప్పుడెప్పుడూ రాని వ్యక్తి ఇప్పుడు కేవలం మెస్సీని చూడటం కోసం రావటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రానుపోను నాలుగు గంటలు ప్రయాణం చేసి, ఫలక్‌నుమా ప్యాలెస్‌లో దాదాపు రెండున్నర గంటల పాటు వేచి ఉండి మరీ మెస్సీని కలిశారు. శనివారం ఢిల్లీలో 2.15 గంటలకు బయలుదేరిన ఆయన రెండు గంటల ప్రయాణం చేసి సాయంత్రం 4.15కు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు హోటల్ రూమ్‌లో వేచి ఉండి, రాత్రి 8 గంటలకు మెస్సీని కలిసి తరించారు. 5 నిమిషాల మెస్సీ ఈవెంట్ కోసం ఇదే రాహుల్‌గాంధీ 8 గంటల విలువైన సమయాన్ని ఖర్చు చేయటంపై రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మెస్సీ భారతదేశ పర్యటనను అదానీ గ్రూప్ స్పాన్సర్ చేస్తున్నది. ఇందులో భాగంగా ఆయన శనివారం కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో పర్యటించారు. ఆదివారం ముంబై, 15న ఢిల్లీలో ఈవెంట్లను ఏర్పాటు చేశారు. ప్రధానితో ఆదానీకి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల కట్టబెట్టడం, నిబంధనల ఉల్లంఘన, పెట్టుబడులలో అవకతవకలపై పార్లమెంటులో అనేకసార్లు ప్రస్తావించారు. అదానీ వంటి వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చడానికే అగ్నిపథ్ పథకం తెచ్చారంటూ విమర్శలు గుప్పించారు. 2014 నుండి 2022 మధ్య అదానీ సంపద పెరిగిన తీరుపై లోక్‌సభలోనే ప్రశ్నించారు. అదానీ గ్రూప్‌పై విదేశాల్లో జరిగే దర్యాప్తును కేంద్రం అడ్డుకుంటున్నదని, ఆదానీతో అంటకాగుతున్న వారందరినీ జైళ్లో పెట్టాలని తీవ్ర స్వరంతో అన్నారు.
అయితే.. అదానీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయటం కోసమే రాహుల్‌గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారని ప్రచారం జరుగుతున్నది. ఓవైపు అదానీని రాహుల్‌గాంధీ విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నా, మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అదానీ పెట్టుబడులపై మౌనంగా ఉన్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2024 జనవరి 23న దావోస్‌లో జరిగిన ఆర్థిక వేదికలో అదానీ కంపెనీలతో రేవంత్ ప్రభుత్వం రూ.12,400 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నది. ఒప్పందాలను రాహుల్ సమర్థించినట్లు వార్తలు వచ్చాయి. ఒకవైపు అదానీ గ్రూప్ మీద విమర్శలు చేస్తూనే..మరోవైపు అవకాశం ఉన్న చోట ఆయన వ్యాపారాన్ని ప్రమోట్ చేయటంతో ఆయన వైఖరిపై రాజకీయంగా గందరగోళం నెలకొన్నది. రాహుల్ మాటలకు చేతలకు పొంతనే లేదనే విమర్శలు వస్తున్నాయి.