హాలియా, డిసెంబర్ 20: రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత కారు స్పీడుకు కాంగ్రెస్ ఖతమవుతుందని, మరో 20 ఏండ్లు ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. శనివారం నల్లగొండ జిల్లా హాలియాలోని లక్ష్మీనర్సింహా గార్డెన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ నాగార్జునసాగర్ నియోజకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంసీ కోటిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌నాయక్, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్‌తో కలిసి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. రెండేండ్లలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నింటా విఫలం అయ్యిందనడానికి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కారు గుర్తు కాంగ్రెస్ పార్టీని తొక్కుకుంటూ పోతదని స్పష్టంచేశారు. మళ్లీ 20 ఏండ్ల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చే పరిస్థ్ధితి లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే భగత్‌కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ కోటిరెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, భారీగా హాలియాకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.