కంఠేశ్వర్, ఫిబ్రవరి 24: జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సీఎస్ దృష్టికి తెచ్చారు. ఇంటర్ వార్షిక పరీక్షలకు మొత్తం 36,963 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 24,542 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
144 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ఇంటర్, పదో తరగతి పరీక్షలను విజయవంతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. వీసీలో జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, డీఈవో అశోక్, డీపీవో శ్రీనివాస్‌రావు, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, గంగాధర్, ఉమా మహేశ్వర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.