హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ‘బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వారి ఓట్లతోనే గెలిచారు. కానీ, వార్షిక బడ్జెట్లో అదే బీసీలను కాంగ్రెస్ పాలకులు విస్మరించారు. రూ.3 కోట్లకు పైగా తెచ్చిన తాజా బడ్జెట్లో కులవృత్తుల ప్రస్తావనే లేకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అలాంటి కాంగ్రెస్‌ను భవిష్యత్తులో బీసీ సమాజం క్షమించబోదు’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏటా బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ హామీని కాంగ్రెస్ పాలకులు మరచారని విమర్శించారు. ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాతామన్న హామీని పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్ల పాలనాకాలంలో బీసీలను అడుగడుగునా దగా చేస్తూ వస్తున్నదని ఆరోపించారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, ప్రత్యేక నిధులు కేటాయిస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లకు చేరాయని, వాటి ప్రస్తావన బడ్జెట్లో ఎందుకు చూపలేదని మండిపడ్డారు.
బీసీ సబ్‌ప్లాన్ ఎక్కడికి పోయింది? అని నిలదీశారు. ప్రజల్ని నట్టేట ముంచడంలో కాంగ్రెస్ పార్టీ దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా అని, భవిష్యత్తులో బీసీ సమాజం ఆ పార్టీని క్షమించబోదని, నామరూపాలు లేకుండా చేస్తుందని హెచ్చరించారు. బీసీల ఆత్మగౌరవాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టారని గుర్తుచేశారు. నాడు బీసీ ఆత్మగౌరవ భవనాలకు రూ.10 వేల కోట్ల విలువైన స్థలాలను కేటాయించి బీసీ వర్గాలకు విశేష ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డీ.. తమరు చేపట్టిన ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళనకు ఎవరికోసం అని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీతో బీసీల ఫ్యూచర్ మారుతుందా? అని నిలదీశారు. బీసీలను ఇంకా ఎన్నిరోజులు మోసం చేస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణను కాంగ్రెస్ అనే పెద్దపాము మింగిందని ఎద్దేవా చేశారు. బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ ఎటు పోయింది? అని నిలదీశారు. మంత్రుల ఇండ్లకు రక్షణ కల్పిస్తూ, పేదల ఇండ్లను హైడ్రా పేరుతో కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎవరికిచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఆలోచించాలని హితవు పలికారు. మంత్రివర్గంలో బీసీల ప్రాతినిథ్యం పెరుగాలని డిమాండ్ చేశారు.
బీసీ వర్గాల బాగుకోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ధ్వజమెత్తారు. బీసీల్లోని అన్ని వర్గాలను కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల విషయంలో మోసం చేసిందని విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సీహెచ్ ఉపేంద్ర, బాలరాజుయాదవ్, చిరుమళ్ల రాకేశ్, నాగేంద్రగౌడ్, కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.