సిద్దిపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సరఫరా చేసే విద్యుత్తు పరిస్థితి మళ్లీ పాత రోజులకు చేరిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అందించామని, అయితే కేసీఆర్ కంటే మెరుగ్గా ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం రైతులకు 10గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, అందుకు సిద్దిపేట జిల్లా గంభీర్పూర్ సబ్‌స్టేషన్ లాగ్బుక్కే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గతంలో విద్యుత్తు సరఫరాపై కాంగ్రెస్ నేతలు సబ్స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు పరిశీలించి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు అదే లాగ్‌బుక్‌లను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ విద్యుత్తు సరఫరా పరిస్థితి ఏమిటో తెలుస్తుందని చెప్పారు.
శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రైతు సదస్సుకు హరీశ్‌రావును స్థానిక రైతులు కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. పంటలకు అవసరమైన స్థాయిలో విద్యుత్తు సరఫరా కావడం లేదని, పగటి వేళల్లోనే కోతలు ఉండటంతో వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు హరీశ్‌రావు, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డితో కలిసి గంభీర్పూర్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి లాగ్‌బుక్‌ను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. లాగ్‌బుక్‌లో నమోదైన వివరాల ప్రకారం ఈ నెల 3న ఉదయం 8గంటలకు విద్యుత్తు సరఫరా ప్రారంభమై సాయంత్రం 6గంటలకు నిలిపివేసినట్టు ఉన్నదని చెప్పారు. రైతులకు సుమారు 10గంటలు మాత్రమే సరఫరా జరిగిందని హరీశ్‌రావు వివరించారు. ఈ నెల 4న కూడా ఉదయం 7.45 గంటలకు సరఫరా ప్రారంభమై సాయంత్రం 6 గంటల సమయంలో నిలిపివేసినట్టు నమోదైందని తెలిపారు.
విద్యుత్తు సరఫరాపై గతంలో విమర్శలు చేసిన మంత్రి కోమటిరెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు. ‘ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇచ్చినా.. 20గంటలే వస్తున్నదని మీరు సబ్స్టేషన్లకు వెళ్లి లాగ్‌బుక్‌లు పట్టుకొని మాట్లాడారు. ఇప్పుడు అదే లాగ్‌బుక్‌లో 10గంటల కరెంట్ మాత్రమే నమోదవుతున్నది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? మీరు చెప్పిన దానికంటే ఒక నిమిషం ఎకువ విద్యుత్తు రైతులకు ఇస్తున్నామని నిరూపించగలరా?’ అని ప్రశ్నించారు. ‘నల్లగొండకు రమ్మంటారా? ఏ సబ్‌స్టేషన్‌కు పోదాం? కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కంటే మీరు ఒక నిమిషమైనా ఎకువ ఇస్తున్నారని లాగ్బుక్తో నిరూపించగలరా?’ అని సవాల్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలు అమలు చేసి వ్యవసాయరంగానికి అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఎరువుల సరఫరా, పంటల కొనుగోళ్ల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారని విమర్శించారు. ఇవాళ ఒక కౌలు రైతుకైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారం సహాయం అందిందా? రైతుబంధు విషయంలోనూ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేశారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే 24గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా సరఫరాను పునరుద్ధరించాలని లేకపోతే రైతులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘రేవంత్ తాను రైతు బిడ్డను, రైతురాజ్యం తెస్తా అని మాటలు చెప్పడం కాదు.. రైతుకు సమయానికి కరెంట్ ఇవ్వాలి.. రైతుబంధు.. రైతుబీమా.. రుణమాఫీ పూర్తి చేయాలి.. ఎరువులు అందుబాటులో ఉంచాలి.. పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలి’ అని సూ చించారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారని, బెజ్జంకి మండలం గుండారంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రోజులు గడుస్తున్నా ప్రత్యామ్నాయం చూపక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.