భీంపూర్/నిజాంపేట, సెప్టెంబర్ 5 : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం శౌకత్పల్లికి చెందిన నారెడ్డి రవీందర్‌రెడ్డి (40)కి నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. వ్యవసాయానికి, కుటుంబ అవసరాల కోసం రూ.4.50 లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గంలేక శనివారం గ్రామ శివారులోని పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు నిజాంపేట ఎస్సై రాజేశ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటికి చెందిన రైతు బూర్గుల అశోక్ (56)కు ఒక ఎకరం, తన తల్లి పేరిట మూడెకరాలు ఉండగా.. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, కంది సాగు చేస్తున్నాడు. గతేడాది భారీ వర్షాలు, వరదలతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు.
దీనికితోడు కుమారుడు శ్రీకాంత్ బ్రెయిన్‌కి ఆపరేషన్ కావడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స చేయించాడు. కొద్ది నెలల క్రితం ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం చేసుకున్నాడు. కుమారుడి వైద్యం, పంట పెట్టుబడికి రూ.5 లక్షలు అప్పుచేశాడు. వాటిని ఎలా తీర్చాలనే బెంగతో శుక్రవారం రాత్రి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. అశోక్ భార్య రాధమ్మ ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు.