కొడంగల్, సెప్టెంబర్ 5 : సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం నడిరోడ్డు మీద పరువు పోగొట్టుకొన్నది. రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను నిరసిస్తూ వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో విద్యార్థి గర్జన నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని బొంరాస్‌పేట సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు.
ఆయనను స్టేషన్‌కు తరలిస్తుండగా, డీజిల్ అయిపోవడంతో వాహనం నడిరోడ్డు మీదనే ఆగిపోయింది. అదే సమయంలో గర్భిణిని దవాఖానకు తరలిస్తున్న అంబులెన్స్ వస్తున్నది. పోలీసు వాహనం అడ్డుగా ఉండటంతో అంబులెన్స్ ముం దుకు కదలలేని పరిస్థితి ఎదురైంది. దీంతో అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే పోలీసు వాహనాన్ని ముందుకు తోసి, అంబులెన్స్‌కు దారి కల్పించేందుకు సహకరించారు. మాజీ ఎమ్మెల్యేను తరలిస్తున్న పోలీసు వాహనంలో మార్గమధ్యంలోనే డీజిల్ అయిపోవడానికి మించిన వైఫల్యం మరొకటి ఏమి ఉంటుందని రణగర్జనకు హాజరైన విద్యార్థులు వ్యాఖ్యానించారు.