హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : నీటివాటాలు తేలాలి.. అవసరాలపై ఇండెంట్లను సమర్పించాలి.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఉత్తర్వులు జారీ చేయాలి.. ఆ తరువాతే ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి జలాలను తరలించుకోవాలి. కానీ అవేవీ లేవు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ నిండకముందే జలాల పారకాన్ని ప్రారంభించింది. పోతిరెడ్డిపాడు గేట్లు తెరచింది. ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగిస్తున్నది. కట్టడి చేయాల్సిన కేఆర్ఎంబీ మీటింగ్‌ల పేరిట నెలరోజులుగా కాలయాపన చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కే దన్నుగా నిలుస్తున్నది. నిలదీయాల్సిన రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది. తెలంగాణకు మున్ముందు నీటిముప్పు పొంచి ఉన్నా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.
వాస్తవానికి ఆంధప్రదేశ్‌కు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ నుంచి తెలుగుగంగ 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఆర్బీసీ) 19 టీఎంసీలు కలిపి 34 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. వాటిని తరలించుకోవాలన్నా బోర్డు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ, అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ జలాలను మళ్లించుకుంటున్నది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వమట్టం 885 అడుగులు కాగా, ఆగస్టు 6వ తేదీ నాటికి 870 అడుగులకు చేరుకున్నది. ఇదే అదనుగా ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు నుంచి పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాల మళ్లింపు ప్రారంభించింది. ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 21 టీఎంసీలు తరలించింది. అందులో చెన్నై నగరానికి మంచినీటి సరఫరాకు సంబంధించిన 3 టీఎంసీలను తీసేసినా దాదాపు 18 టీఎంసీలు మళ్లించింది. వీటితోపాటు మల్యాల లిఫ్ట్ నుంచి 7 టీఎంసీలు మళ్లించింది.
ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు జలాల తరలింపును షురూ చేసింది. 1.5 టీఎంసీలకుపైగా తరలించింది. వీటిని లెక్కల్లో చూపడం లేదు. అన్నీ కలిపితే శ్రీశైలం డ్యామ్ నుంచే దాదాపు 30 టీఎంసీలను బేసిన్ అవతలికి మళ్లించింది. ఈ లెక్కలు సైతం ఏపీ సర్కార్ స్వయంగా వెల్లడిస్తున్నవే. కానీ, క్షేత్రస్థాయిలో అంతకు రెట్టింపు స్థాయిలో జలాలను మళ్లించినట్టు ఆయా ప్రాజెక్టులకు వచ్చిన ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఇప్పటివరకు జూరాల నుంచి దిగువకు విడుదల చేసిన జలాలకు, శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన చేరిన జలాలకు మధ్య వ్యత్యాసం దాదాపు 35 టీఎంసీలకుపైగానే ఉన్నది. ఈ లెక్కన శ్రీశైలం నుంచే దాదాపు 65 టీఎంసీలకుపైగా జలాలను ఏపీ మళ్లించుకున్నట్టు స్పష్టమవుతున్నది. ఇవికాకుండా నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా 12 టీఎంసీలను తరలించుకున్నది. దిగువన ప్రకాశం బరాజ్/కృష్ణా డెల్టా సీమ్‌లో 25 టీఎంసీలు, తుంగభద్రలో 5 టీఎంసీలు అన్నీ కలిపితే ఇప్పటివరకు 100 టీఎంసీలకుపైగా ఈ సీజన్లో ఏపీ వినియోగించుకున్నది.
ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాలకు ఇరు రాష్ర్టాలు ఒప్పందాలు చేసుకోవాలి. అందుకు పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలి. కానీ, ఎల్ నినో పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ ఈ సీజన్లో అందుకు భిన్నంగా బోర్డు వ్యవహరించింది. అనుమతులు తీసుకోకుండానే పోతిరెడ్డిపాడు నుంచి నీటి మళ్లింపులను చేపట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సర్కారే బోర్డుకు హుకుం జారీ చేసింది. అదీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటుచేయాలని కోరకుండా, కేవలం నీటి వినియోగాలకు సంబంధించిన త్రిసభ్య కమిటీనే ఏర్పాటు చేయాలని కోరింది. ఆ వెంటనే జీ హుజూర్ అంటూ ఉన్నపళంగా, అదీ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయం తీసుకోకుండానే 13వ తేదీన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఆ తరువాత ఏపీ విజ్ఞప్తితోనే 17వ తేదీకి, 24వ తేదీకి వాయిదా వేసింది. తొలి సమావేశాన్ని నిర్వహించే నాటికే ఏపీ పోతిరెడ్డిపాడు ద్వారా 6.50 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 7.15 టీఎంసీలను మళ్లించుకున్నది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మరోసారి ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసినా మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తీరా ఇప్పుడు నీటి వాటాలపై బోర్డు సమావేశంలోనే చర్చిద్దామంటూ, అందుకు అనుకూలమైన తేదీలను వెల్లడించాలని, నెలాఖరులోగా మీటింగ్ పెడుతామంటూ బోర్డు జారుకున్నది. కానీ, ఇప్పటికే 70 టీఎంసీలను తరలించుకుపోయిన ఏపీ, నెలాఖరులోగా ఉన్న నీళ్లను ఖతం పట్టించే పరిస్థితులే ఉన్నాయి. మొత్తంగా శ్రీశైలం నుంచి జలాలను ఏపీ యథేచ్ఛగా మళ్లించుకొనేందుకే బోర్డు సైతం దన్నుగా నిలుస్తూ, మీటింగ్ పేరిట కాలయాపన చేసిందని స్పష్టమవుతున్నది. నిరుడు సైతం నీటి సంవత్సరం ఆఖరి నెల వరకూ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు.
నీటి ఉత్తర్వులు లేకుండానే జలాలను కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ను కట్టడి చేయాల్సిన బోర్డు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే విద్యుత్తు ఉత్పత్తి చేపడుతున్న తెలంగాణకే తిరిగి నీతులు చెప్తున్నది. సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు మొత్తంగా కలుపుకొని 405 టీఎంసీల వినియోగ లక్ష్యంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టును చేపట్టారు. సాగర్ ప్రాజెక్టు అవసరాలు తీర్చేందుకు సరిపడ నీటిని నిల్వ చేసుకోవడం కోసమే శ్రీశైలం రిజర్వాయర్‌ను నిర్మించారు. శ్రీశైలం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ, ఆవిధంగా 280 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు విడుదల చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 834 అడుగుల వరకు చేరేదాకా పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేపట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో-34 విడుదల చేసింది.
ఆ మేరకు విద్యుత్తు ఉత్పత్తి చేపట్టిన సందర్భాలున్నాయి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి చేపట్టకుండా చోద్యం చూస్తున్నది. కారణం ఏపీ కోసమేనన్న విమర్శలున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ 854 అడుగుల వద్ద పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ సిస్టమ్ (పీఆర్పీ) ఉంటుంది. రిజర్వాయర్‌లో నీటిమట్టం ఆ లెవల్‌కు చేరుకుంటేనే పీఆర్పీ నుంచి కృష్ణా జలాలను యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ మళ్లించుకొనేందుకు వీలుంటుంది. ప్రస్తుతం రిజర్వాయర్ లెవల్ 866 అడుగులకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు నుంచి జలాలను తరలించేందుకు వీలుగా రిజర్వాయర్‌లో నీటినిల్వ మట్టాన్ని మెయింటెన్ చేయడం కోసమే విద్యుత్తు ఉత్పత్తిని నిలుపుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తున్నది. పైగా ఎల్ నినో నేపథ్యంలో తాగునీళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ బోర్డు సుద్దులు చెప్తున్నది.
ఏపీని కట్టడి చేయాలని, బోర్డు సమావేశం ఏర్పాటుచేయాలని నిలదీయాల్సిన తెలంగాణ సర్కార్ మొదటి నుంచీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నిరుడు సైతం రేవంత్ సర్కార్ ఉదాసీనత ఫలితంగానే ఏపీ ఒక్క శ్రీశైలం నుంచే దాదాపు 240 టీఎంసీలను యథేచ్ఛగా మళ్లించుకుపోయింది. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొన్నది. నీటి వినియోగాలపై కూడా తెలంగాణ సర్కార్ దృష్టి సారించలేదు. ఇప్పటివరకు రాష్ట్రం వాడుకున్న జలాలే అందుకు అద్దం పడుతున్నాయి. శ్రీశైలంలో వాడుకున్న నీళ్లు కేవలం 7.8 టీఎంసీలుకాగా.. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 6 టీఎంసీలు, హైదరాబాద్‌కు మంచినీటి సరఫరా కోసం 4.35 టీఎంసీలు, ఏఎమ్మార్పీ ద్వారా 4.18 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు ద్వారా 18 టీఎంసీలు సహా మొత్తంగా వాడుకున్నది నీళ్లు 45.54 టీఎంసీలే. ఆయా ప్రాజెక్టుల పరిధిలో చెరువులను నింపే అవకాశం ఉన్నా తెలంగాణ సర్కార్ ఆ దిశగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి జలాలను యథేచ్ఛగా తరలించుకుపోతున్న నేపథ్యంలో మున్ముందు తెలంగాణకు గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం నెలకొన్నది. శ్రీశైలంపై ఆధారపడి మహబూబ్‌నగర్ సహా 7 జిల్లాల అవసరాలు, నాగార్జునసాగర్‌పై ఆధారపడి నల్లగొండ జిల్లా, హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. తెలంగాణకు కృష్ణా బేసిన్లో, ఆయా జిల్లాలో ఎక్కడా పెద్దపాటి రిజర్వాయర్లు సైతం అందుబాటులో లేవు. కేవలం శ్రీశైలం, సాగర్‌లోనే నిల్వ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న నీళ్లన్నీ ఏపీ ఖాళీ చేసుకొనిపోతే మున్ముందు ఆయా జిల్లాలకు తాగునీటి సంకటం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.