Minister KTR | కరీంనగర్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘కేసీఆర్ అంటే కాళేశ్వరం. కాంగ్రెస్ అంటే శనేశ్వరం.. మళ్లీ శనేశ్వరం కావాలా?. కాళేశ్వరం కావాలా? ఆలోచన చేయాలి’ అని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమ పర్వం కొనసాగాలంటే కేసీఆర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం కాంగ్రెస్ చేతిలో పెడితే గొర్రెల మందకు తోడేలు కాపలా పెట్టినట్టే అవుతుందని చెప్పారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తొమ్మిదేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్‌రెడ్డి అనే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేసిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ విషయంపై పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ అమరీందర్‌సింగ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖను బహిర్గతం చేశారు. ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తిని తెలంగాణకు ప్రెసిడెంట్ ఎలా చేశారని అమరీందర్‌సింగ్ ప్రశ్నించారని గుర్తు చేశారు. దీనికి రేవంత్ వద్ద సమాధానం ఉందా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగను.. పార్టీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్నారని, ఇక్కడి నక్క జిత్తుల కాంగ్రెస్ వాళ్లు ఎన్ని మాటలు మాట్లాడినా పొరపాటున కూడా నమ్మొద్దని కోరారు.
బీజేపీకి-బీఆర్ఎస్కు సంబంధం ఉందంటూ బదనాంచేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా ఈ దేశంలో ఏ ఒక్క పార్టీవోడైనా మాట్లాడాడా? అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు. మోదీ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
60 ఏండ్లు మనల్ని పాలించిన కాంగ్రెస్ కనీసం తాగు, సాగు నీరు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. 150 ఏళ్ల కిందట పుట్టిన కాంగ్రెస్ వారంటీ పూర్తయిందని, ఆ పార్టీ గ్యారెంటీలను నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు. దేశానికి ఒక పార్టీ మొండిచెయ్యి చూపితే.. మరో పార్టీ చెవిలో పువ్వులు పెడుతున్నదని, కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశాభివృద్ధిని విస్మరించిన పార్టీలేనని దుయ్యబట్టారు. మూడు గంటల కరెంట్ కావాలనుకొనే వారు కాంగ్రెస్‌కు ఓటేయాలని.. 24 గంటల కరెంట్ ఉండాలని అనుకునేవాళ్లు కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.
‘ఆరు దశాబ్దాలు సావగొట్టడమేకాదు. 1956లో తెలంగాణకు, ఆంధ్రాకు ఇష్టంలేని బలవంతపు పెండ్లి చేసి మోసం చేసింది కాంగ్రెస్సే. 1968లో 370 మంది పిల్లలను కాల్చి చంపింది కాంగ్రెస్సే. 2004లో మాటిచ్చి 2014 వరకు సావగొట్టి, 1200 మంది తెలంగాణ బిడ్డల సావులకు కారణమైంది కాంగ్రెస్ పార్టీనే’ అని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇవాళ మళ్లీ వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నరు..కపట కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు అని ప్రజలకు సూచించారు.
రైతులకు అడుగడుగునా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్.. వెయ్యికోట్లు ఖర్చుపెట్టి ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలువను సజీవధారగా మార్చారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో నీటి యుద్ధాలు కనిపించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు అన్ని వైపులా జలధారలు కనిపిస్తున్నాయని తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో 1001 గురుకులాలు ఏర్పాటుచేసి అందులో 6.50 లక్షల మంది విద్యార్థులకు చదువును అందిస్తున్నది కాంగ్రెస్ వాళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణలోనే గుడిసే లేని నియోజకవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకుపోతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే 1,747 మందికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోనే ఇది తొలి ప్రయోగమని, డబుల్బెడ్రూం ఇండ్లు, గృహలక్ష్మి లబ్ధిదారులుపోనూ ఇంకా మిగిలి ఉన్న వారందరికోసం సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి అయినా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్యాకేజీ-9లో భాగంగా కోనరావుపేట మండలంలో నిర్మించిన మల్కపేట రిజర్వాయర్‌ను వారంలోగా సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో సిరిసిల్ల ఎట్లుండే, స్వరాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లలో ఎంత తెలివైందో తీరిగ్గా ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలే కేంద్ర బిందువుగా తొమ్మిదిన్నరేండ్లుగా పాలన సాగిస్తున్నట్టు చెప్పారు. ‘మీరు దీవిస్తే మంత్రినయ్యా. నేను చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ ఆశీర్వదించండి’ అని ప్రజలను కోరారు.
దేశంలోనే మొదటిసారిగా 4.25 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది వరకు కాంగ్రెస్, బీజేపీకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో బీడీలు చుట్టే అక్కా చెల్లెళ్లు, టేకేదార్లుంటే ఎవరైనా పట్టించుకున్నారా? అనేది ఆలోచించాలని కోరారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మిలాంటి పథకాలు ఇవ్వాలని గతంలో పాలించిన ప్రభుత్వాలకు ఎందుకు అనిపించలేదో చెప్పాలని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రూ.200 పింఛన్ ఇచ్చినోళ్లు.. ఇప్పుడు రూ.4వేలు ఇస్తామని నమ్మబలుకుతున్నారని.. ఇలాంటి దొంగ పార్టీలపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతు బంధు, ఆసరా పింఛన్లు పొందుతున్నవారు బీఆర్ఎస్కు ఓటేస్తే ఇతర పార్టీల డిపాజిట్లు గల్లంతవుతాయని తెలిపారు.
వేములవాడలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశ్‌యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గోపు బాలరాజు బీజేపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహరావు ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బైపాస్‌రోడ్డులోని హెలిప్యాడ్ వద్ద వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
“మంచి మనిషి.. మీ అందరి తలలో నాలుకలా ఉండే డాక్టర్ సంజయ్‌ను వచ్చే ఎన్నికల్లో 70 వేల మెజార్టీతో గెలిపించాలి’ అని మంత్రి కేటీఆర్ జగిత్యాల ప్రజలను కోరారు. పెద్ద పెద్ద పరిశ్రమలు.. అండర్‌గ్రౌండ్ డ్రేనేజీని తెచ్చుకొని.. జగిత్యాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్రూంలకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ మరో రూ.50 కోట్లు అడిగారని, తద్వారా మరో 1200 మందికి ఇండ్లు వస్తాయని చెప్పారని అన్నారు. మంచి మెజార్టీతో గెలిపిస్తే అందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. జగిత్యాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా పట్టణ ప్రణాళిక తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. డాక్టర్‌గా సంజయ్ ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు అమలుచేస్తూనే.. మరోవైపు వైద్య వృత్తి ద్వారా వేలాది మందికి కంటి ఆపరేషన్లు చేసి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపరి ధర్మరాజు అని, నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ రంగంలో కొప్పుల అంత సౌమ్యులు ఉండరని అభినందించారు. సమైక్య రాష్ట్రంలో ధర్మపురి నియోజకవర్గంలో 40 వేల ఎకరాలు మాత్రమే సాగు కాగా.. ముఖ్యమంత్రిని ఒప్పించి 13 ఎత్తిపోతల పథకాలు సాధించి అమలు చేయడంవల్ల సాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.26 లక్షలకు పెరగడం కొప్పులకు ధర్మపురి నియోజవర్గంపై ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్‌కు అన్నిరంగాల్లో తమ్ముడిగా ఉంటూ.. గెలుపోటములను సమానంగా తీసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడే ఈశ్వర్‌ను వచ్చే ఎన్నికల్లో 60 వేల నుంచి 70 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ధర్మపురి ప్రజల్లో ధర్మం ఉంటే.. ధర్మరాజులాంటి ఈశ్వర్‌కు ఓటు వేయాలని విజప్తి చేశారు.