హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) విషయంలో ఆ పార్టీ పెద్దల మాటలు వింటుంటే అసలు ప్రభుత్వానికి ప్రాజెక్టుపై స్పష్టత ఉన్నదా? లేకుంటే అంతా ‘రియల్’ డ్రామాలేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో శుక్రవారం సీఎం, ఐటీశాఖ మంత్రి డీపీఆర్‌పై చెరో విధంగా మాట మాట్లాడటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ పెద్దల అంచనా అంకెల్లోనే కాదు.. మాటల్లోనూ గందరగోళం నెలకొన్నది. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, ఐటీశాఖ మంత్రి ఎవరికి వారే ఇష్టమొచ్చిన స్టేట్మెంట్ ఇస్తూ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టులోని లొసుగులను బహిరంగంగా బయట పెడుతున్నారు. గతంలో ఇప్పటికే డీపీఆర్ తయారైందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారు. తాజాగా ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు మరో నెలలు నెలల్లో డీపీఆర్ సిద్ధం చేస్తామని తెలిపారు. కొసమెరుపుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుపై తమకు పూర్తి అవగాహన ఉన్నదని.. సంక్రాంతిలోగా క్లారిటీ ఇస్తామని, మార్చి 31లోగా పనులు ప్రారంభిస్తామని సెలవిచ్చారు. దీంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
హరీశ్ ప్రశ్నలకు చెరో సమాధానం
అసెంబ్లీలో చర్చ సందర్భంగా మూసీ ప్రాజెక్టు, ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎన్ని ఇండ్లను కూల్చేశారు? ఎంతమంది నిర్వాసితులకు పునరావాసం కల్పించారు? ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేశారు? పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్‌రెడ్డి పొంతనలేని సమాధానం చెప్తూ మూసీ ప్రక్షాళన అంతా మోసమని, రియల్ దందాలో భాగమేనని చెప్పకనే చెప్పారని విమర్శలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో మూసీ ప్రాజెక్టు వివరాలు ప్రదర్శించారు. గండిపేట్ నుంచి బాపూఘాట్ వరకు 21 కిలోమీటర్లలో మొదటి ఫేజ్ ప్రక్షాళన చేస్తామన్నారు. ఏడీబీతో రూ.4,100 కోట్ల లోన్ తీసుకునేందుకు అంగీకారం చేసుకున్నామని చెప్పారు. లండన్-సింగపూర్ మోడల్స్ అధ్యయనం చేసి ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్ నిర్మిస్తామని ప్రకటించారు.
ఇందుకోసం మార్చి 31లోపు అంచనాలు ఖరారు చేసి, టెండర్లు పిలిచి పనులు మొదలుపెడుతామని వెల్లడించారు. నిర్వాసితులకు బ్రహ్మాండమైన టవర్లలో ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ డీపీఆర్ ప్రాసెస్‌లో ఉన్నదని, ప్రక్రియ 4 నెలల్లో పూర్తి చేసి ఎమ్మెల్యేల సలహాలు తీసుకుంటామని చెప్పారు. హిమాయత్‌సాగర్‌కు నీళ్లు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం మెగావిజన్ అని చెప్పుకుంటున్నా, డీపీఆర్, ఖర్చు బ్రేకప్, పునరావాస లిస్ట్‌లు బయటపెట్టకపోతే మూసీ మరో ఆర్థిక గుదిబండగా మారే ప్రమాదం ఉన్నదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్యాకేజీ రూ.1.5 లక్షల కోట్లు, ఫస్ట్‌ఫేజ్ రూ.4,100 కోట్లనీ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. డీపీఆర్ లేకుండా పనులు ప్రారంభించడం అంటే నీటి మీద మాటలేనని హరీశ్‌రావు విమర్శించారు. మూసీ నోటిఫికేషన్.. లూటీ నోటిఫికేషన్ అని విమర్శించారు.