హైదరాబాద్, ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కమిషన్ నివేదికపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కమిషన్ నివేదికలోని ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావును సభలో ఎలా నిలువరించాలి? కమిషన్ నివేదికపై వారు మాట్లాడితే ఎలా అడ్డుకోవాలనే దానిపైనా పలువురు ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా వివరించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే కమిషన్ నివేదికలోని అంశాలపై నీటిపారుదలశాఖ అధికారులతో శుక్రవారం సాయంత్రం ఉత్తమ్ భేటీ కాగా, ఆ తరువాత రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.
నివేదికపై అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగించారు. కమిషన్ నివేదికలో ప్రత్యేకంగా బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు ఏయే అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలి? అనేదానిపైనా మంతనాలు సాగించారు. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ప్రత్యేకంగా కమిషన్ నివేదికపై అవగాహన కల్పించడం చర్చనీయాంశమైంది. గన్‌మెన్ లేకుండా, ఫోన్లను తీసుకురాకుండా సమావేశానికి హాజరుకావాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఫోన్లు తీసుకువచ్చినా లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. మొత్తంగా బీఆర్ఎస్పై మూకుమ్మడి దాడికి కాంగ్రెస్ సిద్ధమైందని సమాచారం.