హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. పెద్దల భవనాల కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపైకి దూసుకురావటంతో పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నదనే ఆందోళన పార్టీవర్గాల్లో వ్యక్తమవుతున్నది. పార్టీకి చెందిన మెజార్టీ నేతలే హైడ్రాపై పెదవి విరుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ మంత్రులు ఈ వ్యవహారంపై నేరుగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే.. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి క్లాస్ ఇచ్చినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఏకపక్ష, విచ్చలవిడి నిర్ణయాలతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేయొద్దని గట్గిగానే చెప్పినట్టు తెలిసింది.
మాకు మాట మాత్రమైనా చెప్పలేదు
పార్టీలో ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. హైడ్రా వ్యవహారంలోనూ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. పార్టీలో ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిసింది. కనీసం మంత్రులకు కూడా సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, మంత్రులు సీఎం నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీలోనే తేల్చుకోవాలని వాళ్లంతా నిర్ణయించి, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. హైడ్రా విధానాలు తన శాఖ పరిధిలోకి వస్తున్నప్పటికీ ఆ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీసం మాట కూడా చెప్పలేదని ఓ సీనియర్ మంత్రి అధిష్ఠానం వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసినట్టు సమాచారం. హైడ్రాతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదని ఓ మంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో ఏం జరుగుతున్నది: ఖర్గే క్లాస్!
హైడ్రా కూల్చివేతల్లో భాగంగా పల్లం రాజు తమ్ముడు ఆనంద్‌కు చెందిన స్పోర్ట్స్ విలేజ్‌ను కూల్చివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పల్లం రాజు నేరుగా ఖర్గేను కలిసి ఫిర్యాదు చేశారు. కష్టపడి సంపాదించిన డబ్బులతో తన తమ్ముడు ఏడెకరాల స్థలంలో స్పోర్ట్స్ విలేజ్‌ను ఏర్పాటు చేశారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, సీనియర్ నేతలతో పాటు పల్లం రాజు కూడా ఫిర్యాదు చేయటంతో రేవంత్‌పై ఖర్గే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి.. ‘అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. హైడ్రా వంటి కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీసినట్టు తెలిసింది.
రాహుల్‌గాంధీకి చెప్పి అనుమతి తీసుకొన్నానని రేవంత్ బదులిచ్చినట్టు తెలిసింది. రేవంత్ మాటలతో ఖర్గే విసుగెత్తి తన పక్కనే ఉన్న పల్లంరాజుతో ‘ఆయన తలతిక్కగా మాట్లాడుతున్నారు. మీ ఆగ్రహాన్ని ట్విటర్లో పెట్టండి’ అంటూ సూచించినట్టు తెలిసింది. దీంతో వెంటనే పల్లం రాజు.. ఖర్గేను కలిసిన ఫొటోను ట్విటర్లో షేర్ చేసి హైడ్రాతో రేవంత్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎండగట్టారు. ఖర్గేతో వివాదాన్ని డైవర్ట్ చేసేందుకు తనకు అనుకూలమైన పత్రికలో దాని అధిపతి రాసే కాలమ్‌లో.. హైడ్రాకు రాహుల్‌గాంధీ సపోర్ట్ ఉన్నట్టు రాయించుకున్నారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్‌రెడ్డికి కొన్ని నెలలుగా రాహుల్‌గాంధీ అపాయింట్మెంటే దొరకటం లేదని, అలాంటప్పుడు హైడ్రాపై ఆయన అనుమతి ఏ విధంగా తీసుకుంటారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఖర్గేను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ పేరును సీఎం రేవంత్‌రెడ్డి ఉపయోగించుకున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఆ నేతలే టార్గెట్‌గా హైడ్రా
ఎమ్మెల్యేగా ఉన్న ఓ మీడియా అధిపతి, కీలక మంత్రి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు దగ్గరగా ఉండే మంత్రి టార్గెట్‌గా హైడ్రాను తీసుకొచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు మంత్రి.. షర్మిల సహాయంతో ఢిల్లీలో తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానం రేవంత్‌రెడ్డిలో నెలకొన్నదని తెలిసింది. ఆ మంత్రికి ఆర్థిక బలం, నాడు అధిష్ఠానంతో దగ్గరగా మెలిగిన నేత రామసహాయం సురేందర్‌రెడ్డి కుటుంబంతో బంధుత్వం కూడా ఉన్నది. ఆ మంత్రి.. తనకు పోటీ అవుతారనే ఉద్దేశం రేవంత్‌రెడ్డిలో ఉన్నదని తెలిసింది. ఆయనను హైడ్రా ద్వారా లొంగదీసుకోవాలని భావించినట్టు తెలిసింది. ఇతర పార్టీలకు చెందిన నేతలను భయపెట్టేందుకూ హైడ్రాను బూచిగా చూపెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. చేరితే పార్టీలో చేరండి.. లేదంటే హైడ్రా బుల్డోజర్ దూసుకొస్తదని బెదిరింపులు చేస్తున్నారన్న గుసగుసలు పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి.
‘ఇప్పుడెందుకీ వ్యవహారం?’
హైడ్రా పేరుతో ఆక్రమ భవనాలను కూల్చివేయడంపై కాంగ్రెస్‌లోనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముందుగా బడాబాబుల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్ వెళ్లినప్పుడు పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ ఇది పేదల ఇండ్లపైకి మళ్లటంతో పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరుతో ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదని, హైడ్రా వ్యవహారంతో ఇది మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని వాళ్లంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న పరిస్థితుల్లో హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చితే పార్టీ పరిస్థితి ఏమిటని నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు అధిష్ఠానం వద్ద మొరపెట్టుకొని.. ఇప్పుడీ తలనొప్పి అవసరమా! అని అన్నట్టు సమాచారం.