హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు కాంగ్రెస్ మరోసారి ధోకా ఇచ్చింది. చిత్తశుద్ధిని శంకించేలా వ్యవహరిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో తడా ఖా చూపిస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను వాయిదా వేసినట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం ఆగస్ట్ 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ లో ఆందోళన చేయాలని సోమవా రం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయాన్ని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజా సంఘాలంతా ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ పర్యటనను వాయిదా వేసినట్టు తెలిసింది.
పార్లమెంట్ సమావేశా లు, రాష్ట్రంలో ఈ నెల 31 నుంచి 6వ తేదీ వరకు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉండటంతో ఢిల్లీ పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తిరిగి ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచా రం. అయితే కాంగ్రెస్ పార్టీ తీరుపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై మీకున్న చిత్తశుద్ధి అంటూ ప్రశ్నిస్తున్నారు. క్యా బినెట్లో నిర్ణయించి, ప్రకటించిన తేదీలను మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. బీసీల తరఫున ఆందోళన చేయడం ఇష్టంలేకనే తేదీలు మార్చారని వారు ఆరోపిస్తున్నా రు. ఏదో హడావుడి చేసి బీసీలను మభ్యపెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.