Congress | నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్16(నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో ‘ఉత్త(మ్)మ’ నిర్ణయాల పేరుతో కౌంటర్ చెక్ పాలిటిక్స్‌ను అధిష్ఠానం అమలుచేస్తున్నదా? కొంతకాలంగా కాంగ్రెస్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇటువంటి అభిప్రాయమే కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వంతోపాటు పార్టీపై కూడా పూర్తి స్థాయిలో పట్టు బిగించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకోసం పలు ప్రతిపాదనలు, సిపార్సులతో అధిష్ఠానం వద్దకు వెళ్తున్న రేవంత్‌రెడ్డికి వెంటనే గ్రీన్‌సిగ్నల్ లభిస్తున్నట్టు లేదు. రేవంత్‌రెడ్డి తమ ముందు పెడుతున్న అంశాలపై అధిష్ఠానం సెకండ్ ఓపీనియన్ తీసుకోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఆదినుంచీ సోనియాగాంధీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి లాయల్‌గా ఉండే ఒకరిద్దరి నేతలతో రేవంత్ సిఫార్సులపై చర్చించాకే ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.
అందువల్లే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలన్నీ నిదానంగా సాగుతున్నట్టు తెలుస్తున్నది. మంత్రివర్గ విస్తరణనే పరిశీలిస్తే.. ఇప్పటికే పలుమార్లు కొలిక్కి వచ్చినట్టే వచ్చి ఆగిపోతున్నది. ఇందులో రేవంత్ సిఫార్సులకు ఉత్తమ్‌కుమార్ చెక్ పెడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. కొత్తగా మంత్రి వర్గంలోకి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డి పేరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. సుదర్శన్‌రెడ్డితోపాటు తనపై అన్నివైపుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వైపు రేవంత్‌రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే, దీనిపై అధిష్ఠానం ఉత్తమ్ అభిప్రాయం కోరగా.. ‘ఒకే ఇంట్లో రెండో మంత్రి పదవి రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాలనుకుంటే తన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతికికి కూడా ఎందుకు ఇవ్వకూడదు?’ అని మెలిక పెట్టారని తెలిసింది.
ఈ పరిణామాలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్‌రెడ్డికి మింగుడు పడలేదు. అందుకే ఉత్తమ్‌ను కూల్ చేసేందుకు ఇటీవల భువనగిరిలో నిర్వహించిన సాగునీటి పనుల సమీక్షలో ‘సీఎం కావాల్సిన వ్యక్తి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి’ అని సంబోధించక తప్పలేదన్న చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి కూడా ఒక మెట్టు దిగి ఉత్తమ్‌ను సంతృప్తిపరిచేందుకు ఆయన సతీమణి పద్మావతిరెడ్డికి అంచనాల కమిటీ చైర్మన్ పోస్టును కట్టబెట్టారన్న చర్చ జరుగుతున్నది. అంచనాల కమిటీ చైర్మన్ పదవిని పద్మావతితోపాటు ఉత్తమ్ కూడా ఊహించలేదని సమాచారం. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తన అభిప్రాయం తప్పనిసరి అన్న ధీమాలో ఉత్తమ్ ఉన్నట్టు తెలుస్తున్నది. ఎట్టకేలకు అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎంపిక చేసినా, రేవంత్‌రెడ్డి పంతం అంత ఈజీగా నెగ్గలేదన్నది నిజం. ఇక్కడ కూడా మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పోటీగా బలరాంనాయక్, మధుయాష్కీగౌడ్ రేసులో నిలిచారు. రేవంత్ అవుట్రైట్గా మహేశ్‌కుమార్‌గౌడ్ వైపు మొగ్గు చూపగా, ఉత్తమ్ అందుకు భిన్నంగా తటస్థ వైఖరి అనుసరించడంతో ఆలస్యమైనట్టు సమాచారం.
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలిసింది. ఆదినుంచీ పార్టీని నమ్ముకుని, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేతలకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాదన. అయితే, సీఎం రేవంత్ మాత్రం తనతోపాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలకు, ప్రస్తుతం తన వర్గంగా కొనసాగుతున్న వారికే పెద్దపీట వేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అందుకు గత నెలలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డికి నామినేటెడ్ పోస్టుల కేటాయింపులను ఉదహరిస్తున్నారు. వీరు ఎన్నికల అనంతరం వారి అవసరాల కోసం పార్టీలోకి వచ్చారని, అలాంటి వారికి వెంటనే పోస్టులు ఇస్తే పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఉత్తమ్ అడ్డుపడినట్టు సమాచారం.
పోస్టుల ప్రకటన అనంతరం పార్టీ అధిష్ఠానం మరో విషయంలో తనును ఢిల్లీకి పిలిస్తే ఉత్తమ్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. ‘ఇది మంచి సంప్రదాయం కాదు.. వెంటనే వారి పోస్టులను హోల్డ్‌లో పెట్టాలి’ అని అధిష్ఠానానికి సూచించినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. ఉత్తమ్ దెబ్బతో పోచారంతోపాటు అమిత్‌రెడ్డి కొన్నాళ్లు పదవీ బాధ్యతలు చేపట్టకుండానే వేచి చూడాల్సి వచ్చింది. ఈ పరిణామాలను అవమానంగా భావించిన రేవంత్‌రెడ్డి వర్గం… వారం రోజుల కిందట వీరిద్దరినీ గుట్టుచప్పుడు కాకుండా బాధ్యతలు చేపట్టాలని పురమాయించినట్టు తెలిసింది. దాంతో వీరిద్దరూ ఎలాంటి హంగూ, ఆర్భాటం, ప్రచారం లేకుండా బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వ పాలన లేదా పార్టీ పరమైన కార్యక్రమాల్లో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఆయన వర్గం తనను సంప్రదించకపోయినా… తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోయినా పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదన్న ధోరణితో ఉత్తమ్ ఉన్నట్టు సమాచారం. కీలక నిర్ణయాల్లో అధిష్ఠానం తనను తప్పకుండా సంప్రదిస్తుందన్న ధీమాలో ఉత్తమ్ ఉన్నారు. రేవంత్‌రెడ్డి నేరుగా రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉండే ప్రయత్నాలు చేస్తుంటే, ఉత్తమ్‌కుమార్ మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
దీంతో అధిష్ఠానం వద్ద రేవంత్‌రెడ్డి ఏ ప్రతిపాదనలు పెట్టినా వెంటనే అవి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చేరుతున్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాంతోపాటు రాష్ట్రంలో రేవంత్‌రెడ్డితో అంటీముట్టన్నట్టుగా ఉండాలనే ధోరణినే ఉత్తమ్ అనుసరిస్తున్నట్టు సమాచారం. ‘రేవంత్‌రెడ్డి పిలిస్తే పోతా… పిలువకపోతే ఎందులోనూ ఇన్వాల్వ్ కాను. నా పని నేను చేసుకుంటా. నా లెక్క నాకుంటుంది కదా’ అనే ధోరణిని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యక్తపరుస్తున్నారు.