హైదరాబాద్ మే 20 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు ఇచ్చిన నోటీసులను కాంగ్రెస్ రాజకీయ కమిషన్ నోటీసులుగా పరిగణిస్తున్నామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కక్ష సాధింపు కోసమే కాంగ్రెస్ ఇలాంటి దుర్మార్గపు పనులను ఒడిగడుతున్నదని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నిద్రాహారాలు మాని తెలంగాణ ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చేందుకే ఈ బృహత్తర ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ చేశారని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారి పచ్చని పంటలతో విరాజిల్లిందని తెలిపారు. పాలన చేతగాక, పథకాలు అమలు చేయలేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టిని మరల్చేందుకే నోటీసుల పేరిట నాటకమాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌పై కుట్రలను తెలంగాణ సమాజం నమ్మదని చెప్పారు. సూర్యుడిపై ఉమ్మివేస్తే అది తమ మీదే పడుతుందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
హైదరాబాద్ మే 20 (నమస్తే తెలంగాణ): రాజకీయ కుట్రలో భాగంగానే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌గౌడ్ ఆరోపించారు. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ యోధుడిని విచారణ పేరిట ఇబ్బందులు పెట్టడం తగదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు కేసీఆర్‌పై కుట్రలు, కుతంత్రాలు పక్కనబెట్టి ప్రజలకిచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే కాంగ్రెస్‌ను అధఃపాతాళానికి తొక్కడం ఖాయమని హెచ్చరించారు.