పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ సీట్లను గెలిచాం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్, నేను ప్రచారం చేసేదేమీ ఉండదు. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ సాధించిందేమీలేదు. స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. -కేటీఆర్
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జిల్లాలను ఎత్తివేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే జిల్లాల తొలగింపునకు ప్రజలు అనుమతి ఇచ్చినట్లేనని, ఈ అంశాన్ని స్పష్టంగా గుర్తించి వచ్చే పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల్లో ఇప్పటికే జిల్లాలు ఎత్తేస్తారన్న భయం నెలకొన్నదని, ప్రజల్లో తీవ్ర ఆందోళన ఉన్నదని తెలిపారు. తెలంగాణభవన్‌లో బుధవారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జనగామ, నారాయణపేట, వనపర్తి, సిద్దిపేట, సిరిసిల్ల, నిర్మల్, మంచిర్యాల జిల్లాలను ఎత్తేస్తారనే ఆందోళన ప్రజల్లో ఉన్నదని, జిల్లాలు ఉండాలా.. పోవాలా? అనేది మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల కోసం మున్సిపాటీలవారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లను నియమిస్తామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన వారినే బాధ్యతల్లో పెడతామని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇన్చార్జులను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలవారీగా సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని, ఎన్నికలకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నదని స్పష్టంచేశారు. ఎన్నికల కోసం అవసరమైన ప్రచార సామగ్రి అంతా సిద్ధంగా ఉన్నదని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని నేతలకు సూచించామని తెలిపారు. సర్వేలు కూడా చేయిస్తున్నామని, వాటి ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. స్థానిక నేతల ఆధ్వర్యంలోనే ఎన్నికల ప్రచారం కొనసాగుతుందని స్పష్టంచేశారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి నిర్ణయాలు స్థానిక నాయకులే చూసుకుంటారని, టికెట్లు ఎవరికి ఇవ్వాలన్నది కూడా వారే నిర్ణయిస్తారని చెప్పారు. సర్వేలు, అభ్యర్థి బలం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఎన్నికలు లేని ప్రాంతాల నాయకులు, ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఇన్చార్జులుగా నియమిస్తున్నట్టు తెలిపారు.
మెజారిటీ సీట్లు గెలుస్తాం
పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్ సీట్లను గెలిచామని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసీఆర్, తాను ప్రచారం చేసేదేమీ ఉండదని, సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేసినా కాంగ్రెస్ సాధించింది ఏమీలేదని గుర్తుచేశారు. జిల్లాల ఎత్తివేత అంశమే ప్రధాన అస్త్రంగా పురపోరులో ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాలను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో చాలా చోట్ల ప్రజలు ఆందోళనల్లో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కొన్ని జిల్లాలను రేవంత్‌రెడ్డి సర్కార్ ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టణ ప్రజలు ఓట్లు వేస్తే చిన్న జిల్లాలను ఎత్తివేసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. జిల్లాలను కాపాడుకోవాలా? వద్దా? అనేది ప్రజలు వేసే ఓట్లే నిర్ణయిస్తాయని తెలిపారు. బస్తీబాట కార్యక్రమంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నామని చెప్పారు. స్థానికత ఆధారంగా ప్రచారం చేస్తామని, స్థానిక సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకెళ్తామని వెల్లడించారు. పదేండ్ల పాలనతో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే, 100 రోజుల్లో చేస్తామని అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయని 420 హామీల గురించి ఇంటింటికీ వెళ్లి వివరిస్తామని చెప్పారు. ఎన్నికల్లో జనసేన సహా ఎవరైనా పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో బలముంటే తప్ప.. స్థానిక ఎన్నికల్లో గెలువడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. స్థానిక సమస్యల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు.
జీహెచ్ఎంసీ తర్వాత అసెంబ్లీ ఎన్నికలే
మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు పెట్టే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత వచ్చేది అసెంబ్లీ ఎన్నికలేనని పేర్కొన్నారు. శివరాత్రి లోపలే మున్సిపోల్స్ ముగిస్తారని వ్యాఖ్యానించారు. ఫార్ములా-ఈ, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. ‘ఫార్ములా-ఈ’ విషయంలో గ్రీన్కోకు లబ్ధి చేకూర్చామంటూ తమపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే అదే గ్రీన్‌కోతో దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదని కేటీఆర్ విమర్శించారు. గ్రీన్కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దావోస్‌లో ఏపీ బీజేపీ ఎంపీ సహా పలువురితో మంత్రులు చర్చలు జరుపుతున్నారని, ఇది దేనికి సంకేతమని నిలదీశారు. ఒకవైపు ‘ఫార్ములా-ఈ’ కుంభకోణం అంటూ విమర్శిస్తారని, మరోవైపు దావోస్‌లో గ్రీన్‌కోతో చర్చలు జరుపుతారని దుయ్యబట్టారు. ఒకచోట మంచోళ్లుగా, మరోచోట చెడ్డోళ్లుగా ఎలా వ్యవహరిస్తారని నిలదీశారు. ‘దావోస్‌లో గ్రీన్‌కోతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? లోపల లోపల డీల్స్ మాట్లాడుకుంటున్నారా? లేకపోతే కేసులో నుంచి తీసేస్తా.. డబ్బులు ఇయ్యి అని బెదిరిస్తున్నారా? ఏం చేస్తున్నారో చెప్పండి’ అంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు
నగర అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నరు
లేని ‘ఫ్యూచర్‌సిటీ’ పేరుతో జంట నగరాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్‌లో స్థానికులు చేస్తున్న ఉద్యమానికి సీఎం జవాబు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఒకటే ఉండేదని తామేమీ మార్చలేదని స్పష్టంచేశారు. జోన్ల పేర్లను మార్చుతూ నగరాల చారిత్రక నేపథ్యాన్ని మరుగున పరుస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న తుగ్లక్ పనులతో జంట నగరాల అస్తిత్వం దెబ్బతింటున్నదని మండిపడ్డారు. సింగరేణి బొగ్గు గనుల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ మరోసారి డిమాండ్ చేశారు. ఎప్పటినుంచి విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, సింగరేణిపై మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 2014 నుంచి విచారణ చేయాలని, కాకపోతే ‘విజిట్ సైటేషన్ సర్టిఫికెట్’ అనే పనికిమాలిన నిబంధన ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌లో… రాము.. రెమో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హార్వర్డ్ వెళ్లి మంచిగా తిరిగి వస్తారని అనుకుంటున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిలో రాముతోపాటు రెమో కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉదాహరణకు సినిమా టికెట్లు పెంచం అని ఓ వైపు బల్లగుద్ది చెప్తూనే, మరోవైపు సినిమా టికెట్లు పెంచుతూ జీవో ఇస్తారని మండిపడ్డారు. ఒకవైపు, సర్వాయి పాపన్న పేరు మీద జనగామను జిల్లాగా చేస్తామంటూనే, మరోవైపు జిల్లాను తొలగిస్తామని అంటున్నారని పేర్కొన్నారు. అందుకే ఆయనలో రాము, రెమో ఉన్నారని అంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
సర్వేలు కూడా చేయిస్తున్నాం. సర్వేలు, అభ్యర్థి బలం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం వంటి నిర్ణయాలు స్థానిక నాయకులే చూసుకుంటారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలన్నది కూడా వారే నిర్ణయిస్తారు.
-కేటీఆర్
‘ఫార్ములా-ఈ’ విషయంలో గ్రీన్కోకు లబ్ధి చేకూర్చామంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, అదే గ్రీన్‌కోతో దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. గ్రీన్కోను కాపాడేందుకు బ్యాగులు తీసుకుంటున్నారా?
– కేటీఆర్