Congress | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు పెద్దగా జనమే రావడం లేదు. వచ్చిన వారు సైతం నేతల ప్రసంగాలకు స్పందించడం లేదు. వేదికపై నుంచి నేతలే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో నాయకులే లేకపోగా.. ఓటర్లను కదిలించడానికి కనీసం తగిన యంత్రాంగమే లేదు.. అయినప్పటికీ తామే గెలుస్తున్నట్టు ఊదరగొడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి పడరాని పాట్లు పడుతున్నది. మొత్తానికి ఆడలేక వాకిలి వంకర అన్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం.
ప్రజలలో పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ, కాంగ్రెస్సే గెలువబోతున్నట్టు హైప్ క్రియేట్ చేసేలా మైండ్‌గేమ్ ఆడుతున్నది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నది. రోజుకో సర్వే పేరిట ఫేక్ సర్వేలతో ప్రజలను గందరగోళపరచడమే పనిగా పెట్టుకున్నది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను పెద్దఎత్తున ఎంగేజ్ చేసి తప్పుడు ప్రచారానికి తెగబడింది. ఇదంతా చూస్తున్నవారు కాంగ్రెస్‌ది ‘పైన పటారం లోన లొటారం’ అని వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్దఎత్తున సాగిస్తున్న తప్పుడు ప్రచారం వల్ల బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆయోమయానికి గురవుతున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే. ప్రజలను గందరగోళానికి గురిచేసి నాలుగు ఓట్లు సంపాయించవచ్చన్నది ఆ పార్టీ వ్యూహమని తెలుస్తున్నది. ప్రచార సభలో బీఆర్ఎస్ ప్రసంగాలను తమకు అనుకూలంగా ఎడిటింగ్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. ఎడిట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో అనేకం దర్శనమిస్తున్నాయి. వాస్తవానికి ప్రముఖ సర్వే సంస్థలు కానీ, పలు జాతీయ మీడియా సంస్థలు కానీ విడుదల చేసిన నివేదికలన్నీ బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నట్టు వెల్లడించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గెలువబోతున్నదని ప్రచారం చేస్తున్న సంస్థలు ఊరూపేరు లేని ఫేక్ సంస్థలే కావడం గమనార్హం.
పైన పటారం…లోన లోటారం
కాంగ్రెస్ పార్టీ తామే గెలువబోతున్నట్టు చేస్తున్న తప్పుడు ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఎన్నికల నేపథ్యంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ఎన్నికల విశ్లేషకులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఓ పది మందితో మాట్లాడితే ఏడుగురు వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలువబోతున్నదని అన్నారు. మొత్తంగా 70 నుంచి 80 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటే ఇక ఏవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయికి వెళ్లివచ్చిన జర్నలిస్టులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, ఆసరా, కల్యాణలక్ష్మి పథకాల లబ్ధిదారులు ప్రతి ఇంట్లో ఉన్నారు. వారంతా తాము కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపిస్తామని బల్లగుద్ది చెప్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో పోల్ యంత్రాంగం కూడా లేదు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? సోషల్ మీడియాలో జరిగేదంతా తప్పుడు ప్రచారమేనని వారు ఖండిస్తున్నారు. రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత ఉండటం సహజం. కానీ ఆ వ్యతిరేకత ఎక్కడా కనిపించకపోగా, బీఆర్ఎస్కు సానుకూల పవనాలు వీయడం మాత్రం చెప్పుకోదగ్గ పరిణామంగా విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్‌ను నమ్మడం లేదు
కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం లేదన్నది క్షేత్రస్థాయిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఐదు గ్యారెంటీల పేరిట అక్కడి ప్రజలను మోసం చేసి గెలిచి ఆ తర్వాత చేతులు ఎత్తేసిన వైనాన్ని గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలే వివరిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి మూడు గంటలే కరెంట్ ఇస్తామంటూ ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తమ సెల్ఫోన్లలో సేవ్ చేసుకొని వివరిస్తుండటం మరీ విశేషం. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్తు కోతలపై ధర్నాలు, ఆందోళనలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.
వృద్ధులు, చేతివృత్తులవారు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు సీఎం కేసీఆర్‌ను ఇంటికి పెద్దకొడుకులా చూసుకుంటున్నారని వివరిస్తుంటే, ప్రజల్లో కేసీఆర్ పట్ల ఇంతటి అభిమానం గూడుకట్టుకున్నదా? అన్న ఆశ్చర్యం వేస్తుంది. క్షేత్రస్థాయిలో, బయట జరిగే ప్రచారానికి పొంతన కుదరడంలేదు. దీనినిబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ఆడుతున్న నాటకమని అనిపిస్తున్నది.