కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతలకు పంచాయతీ తొలి విడత ఎన్నికలతో షాక్ తగిలింది. వారి స్వగ్రామాల్లో హస్తం పార్టీకి చుక్కెదురైంది. ఆయా చోట్ల బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఘన విజయం సాధించారు. భద్రాచలం, జడ్చర్ల, మహబూబాబాద్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ గూండాల దాడిలో బీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురైన లింగంపల్లి గ్రామంలో గులాబీ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలంలో బీఆర్ఎస్ హవా చాటింది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి సొంత మండలమైన వంగూరు పరిధిలోని పంచాయతీల్లో మేజర్ పంచాయతీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ హవా కొనసాగించింది. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో సీఎం రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 26 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే కేవలం 14 చిన్నపాటి స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు 10 మంది మేజర్ గ్రామ పంచాయతీలలో గెలపొందారు. సీఎం సొంతూరైన కొండారెడ్డిపల్లికి పక్కనే ఉన్న పోల్కంపల్లి, రంగాపూర్, వంగూర్, డిండి, చింతపల్లి వంటి పెద్ద పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. మండల కేంద్రమైన వంగూర్‌లో బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 900 పైచిలుకు ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.
అనిరుధ్‌రెడ్డికి సొంతూరిలో ఎదురుగాలి
బాలానగర్ (రాజాపూర్), డిసెంబరు 11: కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఆయన సొంత ఊరిలోనే ఎదురుగాలి వీచింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో రంగారెడ్డిగూడలో సర్పంచ్‌గా బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటెపాగ రేవతి 31 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ మద్దతుదారుడిపై గెలుపొందారు. ఎమ్మెల్యే సొంత గ్రామ పంచాయతీలోనే కాంగ్రెస్ మద్దతుదారు ఓటమిపాలు కావడంపై నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా కంగుతిన్నాయి. రాజాపూర్ మండలంలో 24 పంచాయతీలకు 16 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది.
ఎమ్మెల్యే మురళీనాయక్ వదిన ఓటమి
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 11: మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్‌కు తన సొంతూరిలోనే చుక్కెదురైంది. తన సొంత గ్రామమైన మహబూబాబాద్ మండలం సోమ్లాతండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత అన్న దల్సింగ్ సతీమణి భూక్యా కౌసల్యను పోటీలో నిలిపారు. ఆమె అదే తండాలో అంగన్వాడీగా విధులు నిర్వర్తిస్తుండగా, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆమెను రాజీనామా చేయించి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. మాజీ సర్పంచ్ ఇస్లావత్ బాలాజీ కాంగ్రెస్ అభ్యర్థిగా తన భార్య సుజాతకు టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు. తన వదిన కౌసల్య ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్న ఎమ్మెల్యే.. రెండోరోజులపాటు సోమ్లాతండాలోనే ఉండి తండావాసులందరినీ తన ఇంటికి పిలిపించుకొని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఒత్తిళ్లకు గురిచేశాడని తండావాసులు ఆరోపించారు. చివరికి ఎమ్మెల్యే ఎన్నిరకాలుగా ఒత్తిడి చేసినా కాంగ్రెస్ బలపర్చిన, ఎమ్మెల్యే వదిన కౌసల్యపై స్వతంత్ర అభ్యర్థి ఇస్లావత్ సుజాత 18 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో తండావాసులు ఆనందంలో మునిగిపోయారు.
‘మానాల’లో బీఆర్ఎస్కే జై
రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి సొంతూరు అయిన మానాల గ్రామంలో బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రుద్రంగి మండలం మానాల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీనర్సయ్యపై 247 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు.
బీఆర్ఎస్కు జైకొట్టిన లింగంపల్లి
కాంగ్రెస్ గూండాల చేతిలో బీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురైన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. గ్రామంలో కార్యకర్తలతో కలిసి వెళ్తున్న ఉప్పల మల్లయ్య, ఇతర బీఆర్ఎస్ నాయకులపై అకారణంగా కాంగ్రెస్ గూండాలు విచక్షణారహితంగా దాడికి దిగడంతో మల్లయ్య మృతిచెందాడు. తొలి విడత గురువారం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మాదాసు చిన వెంకన్న 96 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
మంత్రి కోమటిరెడ్డి పీఏ బెదిరింపులకు లొంగని ప్రజలు
నల్లగొండ నియోజకవర్గం పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పీఏ బెదిరింపులకు నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామస్తులు బెదరకుండా ఓటేసి హస్తం పార్టీకి బుద్ధిచెప్పారు. గ్రామ ఓటర్లను మంత్రి పీఏ మధుసూదన్‌రెడ్డి ప్రలోభాలకు, భయంభ్రాంతులకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మేకల పల్లవి అరవింద్‌రెడ్డి 214 ఓట్లతో ఘన విజయం సాధించారు.
తెల్లబోయిన ఫిరాయింపు ఎమ్మెల్యే ‘తెల్లం’
ఫిరాయింపు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సొంతూరి ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చూపారు. భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వగ్రామమైన పంచాయతీలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మడకం జోగయ్య ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా తగిన తీర్పు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చిన్నబండిరేవు గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపై బీఆర్ఎస్ అభ్యర్థి జోగయ్య 80 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే.. ఆ తర్వాత పార్టీ మారడంపై పంచాయతీ ఎన్నికల్లో ఓటు ద్వారా గ్రామస్తులు బుద్ధి చెప్పినట్టయింది.
రాష్ట్ర టూరిజం చైర్మన్ రమేశ్‌రెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్‌కు ఝలక్
సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి సొంత ఇలాకాలో ప్రజలు బీఆర్ఎస్కు జైకొట్టారు. ఆయన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం బాలెంలలో బీఆర్ఎస్ బలపర్చిన గాలి మమతా నగేశ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపునకు రమేశ్‌రెడ్డి విశ్వప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపును ఆపలేకపోయారు. ఈ గ్రామం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉండటం విశేషం. ఆయన ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలికినట్టయింది.