నందిపేట్, జూలై 21: కాంగ్రెస్ నేతలకు పోలీసుస్టేషన్లో రాచమర్యాదలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా పో లీసులు అదుపులోకి తీసుకున్న నాయకులు ఏకంగా ఠాణాలోనే ప్రెస్‌మీట్ పెట్టడం విమర్శలకు తావిస్తున్నది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో.. ఈనెల 18న పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు.
అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నేతలను ఆర్మూర్ ఠాణాకు తరలించారు. దీంతో అధికార పార్టీ నాయకులు అక్కడే ప్రెస్‌మీట్ పెట్టడం వివాదాస్పదమైంది. పైగా వారు కూర్చున్న టేబుల్‌పై పోలీసు సిబ్బంది టోపీలు కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోపై సీఐ సత్యనారాయణగౌడ్‌ను వివరణ కోరగా.. వారు పోలీస్‌స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడారని చెప్పడం గమనార్హం.