మహబూబ్నగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నారాయణపేట జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్, వార్డు అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వార్డు అభ్యర్థితోపాటు, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ పెద్ద నాయకుడి దృష్టికి తీసుకువచ్చారు. అయితే పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సదరు నాయకుడు సూచించారు.
దీంతో సదరు నాయకుడు ఎవరు లేని సమయంలో తాను పార్టీ నడిపించానని అలాంటిది తాను దరఖాస్తు చేయాలా? అని వాదనకు దిగారు. అక్కడే ఉన్న కొందరు పార్టీ నాయకుడికి మర్యాద ఇవ్వకుండా మాట్లాతవా? అని దాడికి దిగారు. పార్టీ కార్యాలయంలోని ముఖ్యనేత ఎదురుగా కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని తన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాత కాంగ్రెస్ నేతలను తొక్కి పెడుతున్నారని నిన్నమొన్న వచ్చిన వారు పెత్తనం చెలాయిస్తున్నారని సీనియర్ నాయకులు వాపోతున్నారు. నారాయణపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు తన్నుకోవడంతో ఈ వ్యవహారం మంత్రి దృష్టికి వెళ్లింది.. ఎమ్మెల్యే కూడా జోక్యం చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.