Shabbir Ali | నిజామాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్‌కు విధేయుడిగా కొనసాగుతున్న మైనారిటీ నేత, ప్రభుత్వ సలహాదారుడు తాజాగా ఓ ఆడియోలో మాట్లాడిన అంశాలపై పీసీసీ గుర్రుగా ఉన్నది. అది తన వాయిస్ కాదని.. ఫేక్ ఆడియో అంటూ షబ్బీర్ అలీ స్వయంగా పీసీసీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరిగా చలామణి అవుతున్న షబ్బీర్ అలీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తీసుకురావడానికి తెర వెనుక భారీ స్కెచ్ దాగి ఉన్నదని చర్చ నడుస్తున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేయడంతో తన సొంత నియోజకవర్గాన్ని వదిలి షబ్బీర్ నిజామాబాద్ అర్బన్‌కు మకాం మార్చారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మాటను కాదనకుండా తన కామారెడ్డి సీటును వదులుకున్నారు. రెండుచోట్లా కాంగ్రెస్ ఓడింది. షబ్బీర్ అలీ ఎమ్మెల్యేగా గెలువలేక పోయారు. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో ఉండాల్సిన వ్యక్తి కేవలం ప్రభుత్వ సలహాదారు హోదాతో సరి పెట్టుకుంటున్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చక్రం తిప్పిన షబ్బీర్ అలీ.. ఇప్పుడు ఒక స్థాయికే పరిమితం కావడం చర్చనీయాంశం అవుతున్నది.
హస్తం పార్టీకి కీలకమైన మైనారిటీ నాయకుడు షబ్బీర్ అలీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకురావడానికి ముఖ్యనేత సోదరుడి పాత్ర ఉండొచ్చనే అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. కర్ణాటక మాదిరిగా సీఎం మార్పు తథ్యమైతే మైనారిటీ కోటాలో కామారెడ్డి నేతకు అవకాశం రావొచ్చనే ప్రచారం నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నట్టుగా పలువురు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేసినట్టుగానే ప్రస్తుతం షబ్బీర్‌ను సతాయించాలనే ముఖ్యనేత వర్గం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. తద్వారా తానంతట తానుగా బయటకు వెళ్లి పోయేలా పావులు కదుపుతున్నారా? అనే చర్చ కాంగ్రెస్ వర్గీయుల్లో జోరుగా నడుస్తున్నది. ఇదిలావుండగా దశాబ్దాలుగా కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీ నివాసమే డీసీసీ కార్యాలయంగా చలామణి అవుతూ వస్తున్నది. ప్రస్తుతం షబ్బీర్‌కు పోటీగా రెండు వేర్వేరు కాంగ్రెస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. డీసీసీ అధ్యక్షుడు ఒక కార్యాలయం, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి మరో కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో పట్టణంలో పార్టీకి మూడు కుంపట్లు మోపయ్యాయని హస్తం శ్రేణులు నిట్టూరుస్తున్నారు.