Bhumata Portal | హైదరాబాద్, నవంబర్ 3: (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌ను ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా నేతలంతా ఎన్నికల సభల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం ధరణిపై విమర్శలు ఆపలేదు. పూర్తిగా పోర్టల్‌ను తీసేయడం సాధ్యం కాదని బీఆర్ఎస్ ముందునుంచీ చెప్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి అదే ఒప్పుకున్నది. పోర్టల్‌ను పూర్తిగా తీసేయకుండా, అవసరమైన మార్పులు చేస్తామని, పేరు మారుస్తామని చెప్పింది.
ఆ తర్వాత తమకు అవసరమైన ప్రతిసారీ రైతుల అటెన్షన్ డైవర్షన్ కోసం ధరణిని కూడా తెరమీదికి తెస్తున్నది. పది నెలలుగా హడావుడి చేస్తున్నది. మొదట ఐదుగురు సభ్యులతో ధరణి అధ్యయన కమిటీని నియమించింది. కమిటీ పేరు చెప్పి దాదాపు రెండున్నర నెలలపాటు దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలు కావడంతో.. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ‘స్పెషల్ డ్రైవ్’ చేపడతామని ప్రకటించింది. తొమ్మిది రోజుల్లోగా దరఖాస్తులన్నీ పరిష్కరిసామని చెప్పింది. ఆ తరువాత గడువు పొడిగించింది. గడువు పూర్తయ్యేలోగా ఎన్నికల కోడ్ రావడంతో పరిష్కార ప్రక్రియ అటకెక్కించింది. భూ సమస్యలు పరిష్కరిస్తున్నామంటూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రచారం చేసుకున్నది.
అదిగో చట్టం.. ఇదిగో భూమాత!
ధరణి కమిటీ సమావేశాలు కొనసాగుతుండగానే, పూర్తి నివేదిక ఇవ్వకముందే ప్రభుత్వం తమ అనుకూల మీడియా ద్వారా కొత్త చట్టం సిద్ధమైందని, భూమాత పేరును అమలు చేస్తున్నారంటూ ప్రచారం చేసింది. రుణమాఫీ పూర్తిచేస్తామన్న హామీ నెరవేర్చకపోవడం, రైతుబంధు వేయకపోవడం వంటి కారణాలతో ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ సమయంలో అటెన్షన్ డైవర్షన్ కోసం మరోసారి ధరణిని వాడుకున్నది. కొత్త ఆర్వోఆర్ చట్టం ముసాయిదాను విడుదల చేసింది. నెల రోజులపాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పింది. ఆ తర్వాత అమల్లోకి తెచ్చి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రచారం చేసింది.
ఆ గడువు పూర్తయిన తర్వాత సెప్టెంబర్‌లో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని సిద్ధం చేశారు. కానీ, ఆ తర్వాత కొన్నాళ్లపాటు మరుగున పడేశారు. తాజాగా ధాన్యం కొనుగోళ్ల అంశం తెరమీదికి రావడం, ప్రభుత్వం విఫలం కావడంతో అటెన్షన్ డైవర్షన్ కోసం మరోసారి ధరణిని వాడుకున్నారు. మూడు రోజుల కిందట జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదిస్తారని, పోర్టల్ పేరును భూమాతగా మారుస్తారని, ఆర్డినెన్స్ తెస్తారని లీకులు ఇస్తూ విపరీతంగా ప్రచారం చేశారు. కానీ, కొత్త ఆర్వోఆర్ చట్టంపై ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బ్రీఫింగ్ ఇవ్వలేదని సమాచారం. రెవెన్యూ శాఖ అధికారులు సీఎంవో అధికారులకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చట్టం గురించి వివరించారని చెప్తున్నారు. మంత్రి నుంచి సీఎంకు బ్రీఫింగ్ జరగలేదని తెలుస్తున్నది. అయినా చట్టాన్ని ఆమోదిస్తారంటూ డైవర్షన్ కోసం హడావుడి చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ధరణిపై సైలెంట్‌గా ఉన్నదని, ఈ ఏడాది చివర్లో రైతుభరోసా వేయాల్సి ఉంటుందని, ఆ సమయంలో మరోసారి రైతుల అటెన్షన్ డైవర్షన్ కోసం ధరణిని వాడుకుంటారని విమర్శిస్తున్నారు.
పెండింగ్‌కు మోక్షమేది?
ధరణిలో రెండున్నర లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటిని తొమ్మిది రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం మార్చి 1న ప్రకటించింది. అప్పటినుంచి ఇప్పటివరకు వాటి పరిస్థితి ఏమిటో రెవెన్యూ శాఖ చెప్పుకోలేని పరిస్థితి. లక్షకుపైగా దరఖాస్తులు పరిష్కరించామని చెప్పుకుంటున్నా, అవన్నీ అక్షర దోషాల సవరణ, ఖాతాల మెర్జింగ్ వంటి చిన్నచిన్న పనులేనని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. రైతులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నాయని రెవెన్యూ వర్గాలే వెల్లడిస్తున్నారు. వాటిని పరిష్కరిస్తే పట్టాదారుల సంఖ్య, భూ విస్తీర్ణం భారీగా పెరుగుతుందని పేర్కొంటున్నాయి. దీంతో రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు వ్యయం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. అందుకే వాటి పరిష్కారంపై దృష్టిపెట్టడం లేదని అంటున్నారు.